సిటీబ్యూరో, జూలై 22(నమస్తే తెలంగాణ): నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న ముగ్గురు మోసాలకు గురయ్యారు. వీరిలో ఇద్దరు డబ్బులు పోగొట్టుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
వివరాలు ఇలా ఉన్నాయి..
బొల్లారం నివాసి పవన్‌కు ఆన్లైన్లో పరిచయమైన ఓ వ్యక్తి పార్ట్ టైం ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు. రూ.60వేలు తీసుకున్నాడు. మాయమాటలతో తాను సూచించిన వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీ లాభాలంటూ నమ్మించాడు. దీంతో పవన్ మొత్తం లక్ష రూపాయలు డిపాజిట్ చేశాడు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి సమాధానం రాకపోవడంతో మోసపోయానని గుర్తించాడు.
ఇన్‌స్టాగ్రాంలో మార్కెటింగ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రకటనను చూసిన సికింద్రాబాద్‌కు చెందిన శివానీ బోల్తా పడింది. ప్రకటనలో ఉన్న వాట్సాప్ నంబరుకు ఫోన్‌చేసి గుర్తు తెలియని వ్యక్తి చెప్పినట్లు మొత్తం రూ.1.20 లక్షలు డిపాజిట్ చేసింది. లాభాల విషయంపై ఫోన్ చేస్తే డబ్బులు ఇవ్వనని తేల్చి చెప్పాడు. శివానీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మలక్‌పేటకు చెందిన ఓ మహిళకు సంబంధించిన ఫొటోలను ఆమె స్నేహితుడే వాట్సాప్ డీపీలుగా పెట్టి వేధిస్తున్నాడు. బాధితురాలు సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.