సిటీబ్యూరో: ‘మీ ఆధార్‌కార్డు ఉపయోగించి.. సిమ్‌కార్డు తీసుకొని నేరాలకు పాల్పడ్డారు.. మిమ్మల్ని విచారించాల్సి ఉంది.. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం.. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దూ’.. అని హెచ్చరిస్తూ ఓ వృద్ధురాలిని డిజిటల్ అరెస్ట్ చేసిన సైబర్నేరాళ్లు రూ. 64 లక్షలు కాజేశారు. మౌలాలిలో ఉండే బాధితురాలికి గౌరవ్ సారతి పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ‘మీ ఆధార్ వివరాలు దుర్వినియోగమయ్యాయి.. మీ పేరుతో మొబైల్ కనెక్షన్ తీసుకొని ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. దీనిపై బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారం’టూ మాట్లాడారు. ఆమె వాట్సాప్‌నకు కొన్ని ఫేక్ డాక్యుమెంట్లు పంపించారు. సీబీఐ కూడా ఈ కేసును ప్రాధాన్యత కేసులా దర్యాప్తు చేస్తున్నదని, మీరు సీనియర్ సిటిజన్ కావడంతో వీడియో కాల్లో మాట్లాడుతున్నామంటూ సూచించారు.
బ్యాంకు ఖాతాలన్నీ తనిఖీ చేయాలంటూ.. వివరాలు తీసుకున్నారు. ‘అందులో ఉన్న డబ్బంతా మేం సూచించిన ఖాతాలోకి బదిలీ చేయండి, మీకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని రుజువుకాగానే డబ్బంతా తిరిగి మీ ఖాతాలలోకి బదిలీ అవుతుందం’టూ నమ్మించారు. ఈ క్రమంలో బాధితురాలు రూ. 64 లక్షలు దఫ దఫాలుగా సైబర్‌నేరగాళ్లు సూచించిన బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసింది. ఇదంతా మోసమని కొడుకు చెప్పడంతో మల్కాజిగిరి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.