సిటీబ్యూరో, నవంబర్ 16(నమస్తే తెలంగాణ): సినీ పరిశ్రమకు వేలాది కోట్ల రూపాయల నష్టం కలిగించిన ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ పై సీనియర్ ఐపీఎస్, రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ సీవీ ఆనంద్ హైదరాబాద్ పోలీసుల విజయంగా ప్రశంసించారు. దమ్ముంటే తనను పట్టుకోండి అంటూ పోలీసులకే సవాల్ విసిరిన నిందితుడిని ఎట్టకేలకు పట్టుకోవడంపై ఆయన తన ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. డిజిటల్ సర్వర్లను హ్యాక్ చేసి సినిమా విడుదల కంటే ముందే ఒరిజినల్ హెచ్డీ కాపీలను వెబ్సైట్లలో విడుదల చేసి, సినీ పరిశ్రమకు భారీ నష్టాన్ని కలిగించిన ఈ హై లెవల్ పైరసీ కేసు వివరాలను గతంలో తాను ప్రెస్‌మీట్ ద్వారా వెల్లడించినట్లు ఆనంద్ పేర్కొన్నారు. జూన్ 5 నుంచి రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన సైబర్ క్రైమ్స్ డీసీపీ ధారా కవితకు, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు ఆయన అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.