Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో తరచూ ప్రయాణించే నగరవాసులకు గుడ్‌న్యూస్. మెట్రో–ఆర్టీసీ ఉమ్మడి పాస్ విధానాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. నెలవారీతో పాటు రోజువారీ పాస్‌లు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
హైదరాబాద్ బేగంపేట్‌లోని మెట్రో రైల్ భవన్లో హెచ్ఎంఆర్ఎల్, టీజీఎస్ఆర్టీసీ, విద్యుత్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ శాఖల అధికారులతో సీఎస్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్రో–ఆర్టీసీ ఉమ్మడి పాస్ అమలుపై ప్రధానంగా చర్చించారు. మెట్రో, ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ఉమ్మడి పాస్ జారీకి సాంకేతికంగా సిద్ధంగా ఉన్నామని సీఎస్‌కు వివరించారు. ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైల్, ఆర్టీసీ అధికారులు ఏ రోజైనా విధానాన్ని అమలు చేసేలా ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఉమ్మడి చార్జీలను త్వరితగతిన ఖరారు చేసి, పాస్ విధానాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని సీఎస్ ఆదేశించారు.
మరోవైపు హైదరాబాద్ పాత బస్తీలో ప్రతిపాదిత 7.5 కిలోమీటర్ల మెట్రో కారిడార్ పనులపైనా సీఎస్ ఆరా తీశారు. రోడ్డు విస్తరణ పనుల తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. జనరల్ కన్సల్టెన్సీ నియామకానికి సంబంధించిన టెండర్ ప్రక్రియపై అధికారులు వివరాలు వెల్లడించారు. మెట్రో కారిడార్ విస్తరణ పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా మెట్రో పనులు ప్రారంభించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.
సమావేశం అనంతరం సీఎస్ సంజయ్ జాజు స్వయంగా మెట్రోలో ప్రయాణించారు. బేగంపేట్ నుంచి పారడైజ్ వరకు మెట్రో రైల్లో ప్రయాణిస్తూ స్టేషన్లలోని వాణిజ్య సముదాయాలు, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. స్టేషన్లలో అందుబాటులో ఉన్న వాణిజ్య స్థలాలను మరింత సమర్థంగా అభివృద్ధి చేయాలని, పార్కింగ్ సదుపాయాలను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. అలాగే ఎన్‌హెచ్-44పై హెచ్ఎండీఏ నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్లను కూడా సీఎస్ పరిశీలించారు.