ఖైరతాబాద్, జూన్ 25 : విలేకరుల ముసుగులో అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తూ వేధిస్తున్నారంటూ ఓ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి వెస్ట్ జోన్ డీసీపీని ఆశ్రయించారు. జీహెచ్ఎంసీని సెటిల్మెంట్ అడ్డాగా మార్చారని, అక్రమ నిర్మాణాలు, కబ్జా చేసిన స్థలాలను ఆదాయవనరులుగా మార్చుకున్నారని… ఆన్లైన్ పత్రికల్లో తప్పుడు కథనాలు వేస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారంటూ ఆ పోలీసు ఉన్నతాధికారి ముందు ఆ అధికారి వాపోయారు. అంతేకాకుండా పలు వాట్సాప్ గ్రూప్ బాహాటంగానే తన ఆవేదనను వెలిబుచ్చారు. వివరాల్లోకి వెళితే.. జీహెచ్ఎంసీ సర్కిల్ -18 టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్‌ను ఇద్దరు ఫేక్ విలేకరులు గత కొంత కాలంగా వేధిస్తున్నారు.
తాము అడిగినంత డబ్బులు ఇవ్వడంతో పాటు అక్రమ నిర్మాణాలుంటే తాము సెటిల్మెంట్ చేసుకునే అవకాశం కల్పించాలంటూ సతాయిస్తున్నారు. వారి వేధింపులు భరించలేక సదరు టౌన్ ప్లానింగ్ అధికారి.. బుధవారం వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్‌ను ఆశ్రయించారు. ఆకుల కిరణ్ గౌడ్, కుల్ల రవీందర్ అనే ఇద్దరు విలేకరులు ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో టౌన్ ప్లానింగ్ అధికారులను లక్ష్యంగా చేసుకొని జీహెచ్ఎంసీకి సంబంధించిన పత్రాలను వక్రీకరించి, అసత్యపు ఆరోపణలు చేస్తూ డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ పేర్కొన్నారు.
ఇటీవల జీహెచ్ఎంసీ అధికారుల అరెస్టుకు సంబంధించిన వ్యవహారంలోనూ వీరి హస్తం ఉందని ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలు లభించాయన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో అనధికారికంగా ప్రవేశించి తాము విలేకరులమంటూ ఉద్యోగులను బెదిరిస్తూ వారిని వేధింపులకు పాల్పడుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే వీరిపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ జరుపాలని కోరారు.
ఖైరతాబాద్ జోనల్ పరిధిలోని సర్కిల్ -17, సర్కిల్ -18 కార్యాలయాల్లో వారి అనధికారి ప్రవేశాన్ని నిషేధిస్తున్నామన్నారు. పౌర సంబంధాల శాఖ వీరిపై విచారణ జరిపి.. వారు తమ మీడియా కార్డులను దుర్వినియోగపరిచినట్లు నిరూపణ జరిగితే బ్లాక్ లిస్టులో పెట్టాలని కోరారు. తెలంగాణ మీడియా అకాడమీ, మీడియా సంస్థలు స్పందించి జర్నలిజం విలువలను అపహాస్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సదరు విలేకరులపై తాను చేసిన ఫిర్యాదుపై డీసీపీ సానుకూలంగా స్పందించిన విచారణ జరిపిస్తామని చెప్పారని శ్రీనివాస్ తెలిపారు.
ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ సర్కిల్ పరిధిలో కొందరు ఫేక్ విలేకరుల ఆగడాలు మితిమీరినట్లు తెలుస్తోంది. ఎవరైనా అక్రమ నిర్మాణాలకు పాల్పడితే వారి స్థాయి బట్టి రూ. 50 లక్షల నుంచి రూ. 1కోటి వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారి ఆరోపిస్తున్న విలేకరులపై ఇప్పటికే పలు పోలీసు స్టేషన్లలో కేసు నమోదయ్యాయి. ఫేక్ విలేకరులు టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లోని కొందరు సిబ్బందికి డబ్బులు ఆశ చూపిస్తూ తమ వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్నట్లు ఆ సెక్షన్లలోని ఓ అధికారి వెల్లడించారు. సదరు విలేకరులు ఒక్కో ఇంటి వద్ద రూ. కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారని టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్
తెలిపారు.
ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంపై గతంలోనే అనేక ఆరోపణలు వచ్చాయి. కొందరు అధికారులు, సిబ్బంది చేయి తడపనిదే పని జరుగదంటూ ప్రజలు బాహాటంగానే ఆరోపిస్తుంటారు. ఇదే కార్యాలయంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌తో పాటు పలు సర్కిల్ కార్యాలయాలు ఉన్నాయి. పలు కార్యాలయాల్లో వివిధ హోదాల్లో పనిచేసే సిబ్బంది ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన కేసులున్నాయి. అందులో విలేకరులు సైతం పట్టుబడడం గమనార్హం. ఆ తర్వాత అనేక ఏసీబీ కేసులు నమోదయ్యాయి.
కానీ గతంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ సర్కిళ్లలో పనిచేసిన అధికారులెవరూ ఈ విలేకరులకు అడ్డుచెప్పకపోవడం గమనార్హం. ఖైరతాబాద్ జోన్ కార్యాలయం చరిత్రలోనే మొదటిసారి ఓ అధికారి అవినీతి, అక్రమాలను ఎదిరించి తన నిజాయతీని చాటుకున్నారు. కొందరు అధికారులు, సిబ్బందిని అడ్డంపెట్టుకొని బ్లాక్మెయిల్ పాల్పడుతున్న ఇద్దరు విలేకరులపై ఏకంగా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. అయితే ఇప్పటికే సదరు విలేకరులకు సహకరించిన, సహకరిస్తున్న అధికారులు, సిబ్బంది మాత్రం నీతిగా అవినీతిని వెలుగులోకి తెచ్చిన అధికారిపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది.