Runa Mafi | మేడ్చల్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులకు నిరుత్సాహమే మిగులుతున్నది. మేడ్చల్ జిల్లాలో అర్హులు సుమారు 20 వేల పైచిలుకు ఉన్నా.. ఇప్పటి వరకు 3,091 మందే లబ్ధి పొందారు. జిల్లా వ్యాప్తంగా అన్నదాతల అకౌంట్లలో రూ. 17 కోట్లు జమ అయినట్లు అధికారులు సమాచారం ఇచ్చినా.. ఇందులో ఎంత వరకు నిజమన్నది స్పష్టంగా తెలియడం లేదు.
రుణమాఫీ వర్తింపు కాని వారు సహకార సంఘాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోతున్నదని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని సహకార సంఘాలతో పాటు జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీలో ఫిర్యాదులు చేసినా.. సమస్య పరిష్కారం కావడం లేదంటున్నారు. జిల్లాలో మొదటి విడతలో (రూ. లక్ష ) 2,669, రెండో విడత (రూ. లక్ష 50 వేలు)లో 856 మంది రైతులకు మాత్రమే రుణమాఫీని ప్రభుత్వం వర్తింపజేసింది.