Electricity Department | సిటీబ్యూరో, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): విద్యుత్ తనిఖీ విభాగంలో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చీఫ్ ఎలక్టిక్రల్ ఇన్స్పెక్టర్ టు గవర్నమెంట్(సిఈఐజి)విభాగంలో అవినీతి పేరుకుపోతుంది. విద్యుత్ కేబుళ్లు, పరికరాల నాణ్యతను పరిశీలించి, వాటికి అనుమతులిచ్చేందుకు ఈ విభాగం ఏర్పాటు చేశారు. పరిశ్రమలతో పాటు 15 మీటర్ల ఎత్తు దాటిన ప్రతీ వాణిజ్య, గృహ సముదాయానికి విద్యుత్ తనిఖీ అధికారి నుంచి ఎన్వోసీ తప్పనిసరిగా తీసుకోవాలి.
టీఎస్‌ఐపాస్‌లో అప్లై చేసుకున్న తర్వాత వారికి కావాల్సిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఏజెంట్ల ద్వారా వచ్చిన వారికి మాత్రమే ఈ సర్టిఫికెట్ ఇస్తున్నట్లు సమాచారం. భవన సామర్థ్యం, పరిశ్రమల లోడ్‌ను బట్టి వాటికి ఒక రేట్ నిర్ణయించి.. అవి అందితేనే ఎన్వోసీ ఇస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు. వీరిపై ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వారు పేర్కొన్నారు. ఇటీవల జరుగుతున్న అగ్ని ప్రమాదాల్లో ఎక్కువగా ఎన్వోసీలు తీసుకున్న భవనాల్లోనే జరిగినట్లుగా విద్యుత్ అధికారి ఒకరు చెప్పారు. ఇక్కడ సామగ్రి చవకబారుది వాడడం కారణంగానే లోడ్ తట్టుకోలేక షార్ట్ సర్క్యూట్స్ జరుగుతున్నాయని ఆ అధికారి తెలిపారు.
లోడ్‌ను బట్టి రేటు..!
భవిష్యత్ విద్యుత్ అవసరాలు, ఎంపిక చేసిన విద్యుత్ సామర్థ్యం, ఇన్కమింగ్ లైన్, ఇంటర్నల్ విద్యు త్ లైన్లు, కేబుల్స్, ఏబీ స్వీచ్‌లు, ఎర్తింగ్ సిస్టం సహా డీటీఆర్ వంటివన్నీ పక్కాగా ఉన్నట్లు నిర్ధారించిన తర్వా తే ఆ భవనాలకు ఎన్వోసీ ఇవ్వాలి. కానీ అధికారులు వాటినేవీ తనిఖీలు చేయకుండానే ఏజెంట్ల ద్వారా పనులు పూర్తి చేసేస్తున్నారు. భవనాల్లో విద్యుత్ పరికరాల నాణ్యత, లోడ్‌ను బట్టి వారెలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో చూడకుండానే లోడ్‌ను బట్టి రూ.60వేల నుంచి రూ. లక్షన్నర వరకు వసూలు చేస్తున్నారు.
ఇక వాణిజ్య భవనాలు, పరిశ్రమలైతే ఏకంగా రూ. 7నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సీఈఐజీ అనుమతుల కోసం ఆయా అపార్ట్మెంట్లు, పరిశ్రమలు, టీఎస్ ఐపాస్‌లో డ్రాయింగ్ అప్రూవల్స్‌ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏజెంట్ల ద్వారా వచ్చే వాటికే అనుమతులు ఇస్తూ ఇతర మార్గాల ద్వారా వచ్చే ఫైల్స్‌కు ఏదో ఒక సాకు చూపించి తిరస్కరించడంతో విధిలేక ఆ వినియోగదారులు ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు.
సీఈఐజీకి సంబంధించినంతవరకు 40మంది ఉద్యోగులు ఉండాల్సిన చోట కేవలం 15 మంది మాత్రమే ఉండడంతో అసలు సమస్య అక్కడే వస్తోంది. ఉన్న ఉద్యోగులే తనిఖీలు చేయాలి కాబట్టి వారికే డిమాండ్ ఎక్కువైంది. తాము అనుమతి కావాలనుకున్న సందర్భంలో కచ్చితంగా ఆ ఉద్యోగులకే కేటాయింపులు జరుగుతాయి కాబట్టి వారి డిమాండ్‌ను బట్టి డబ్బులు ఇవ్వాల్సి వస్తున్నదని వినియోగదారులు బాధపడుతున్నారు.
తనిఖీల లోపంతో అగ్ని ప్రమాదాలు..!
హైదరాబాద్ నగరంలో ఇటీవల అగ్నిప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. నాణ్యతలేని వస్తువులు వాడడం వల్ల షార్ట్‌సర్క్యూట్ జరుగుతున్నదంటూ పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ నాణ్యత ప్రమాణాలు నిర్ణయించాల్సిన విద్యుత్ తనిఖీ అధికారులు ఆ దిశగా పట్టింపు లేకుండా వ్యవహరించడం మూలంగా లోడ్ పెరిగి షార్ట్ సర్క్యూట్ జరుగుతున్నదని తెలుస్తోంది.
మరోవైపు పాతబస్తీ, శివారు ప్రాంతాల్లోని పాత భవనాల్లో ఇప్పటికీ ఫ్యూజులు, విద్యుత్ లైన్లు మార్చకపోగా పాతవాటిపైనే ఇంకా విద్యుత్ వినియోగం కొనసాగిస్తున్న నేపథ్యంలో వాటిని తనిఖీ చేయాల్సిన అధికారులు ఆ దిశగా చూడడం లేదు. ఇటీవల జరిగిన పలు అగ్ని ప్రమాదాల్లో సాధారణ భవనాలతో పోలిస్తే సీఈఐజీ నుంచి ఎన్ఓసీలు, పీరియాడికల్ ఇన్స్పెక్షన్లు జరిగిన భవంతుల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. వీటిలో నాణ్యమైన విద్యుత్ సామగ్రి వాడకపోవడం వల్ల ఎండాకాలం పెరుగుతున్న లోడ్ తట్టుకోలేక ఈ ప్రమాదాలు జరిగినట్లు అధికారులు చెప్పారు.
మరోవైపు ఈ అగ్ని ప్రమాదాలు జరిగిన చోట అక్కడ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని సర్టిఫై చేయాల్సింది కూడా సీఈఐజీ అధికారులే కావడంతో ఇన్సూరెన్స్‌కు సంబంధించి క్లెయిమ్ చేసుకోవడానికి వారిచ్చే సర్టిఫికెట్ కీలకమవుతుంది. దీంతో సదరు సంస్థ భవనంలో విద్యుత్ సామగ్రి సక్రమంగా ఉందా లేదా అంటూ చెక్ చేసి రెన్యువల్ చేసిన వారే దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగిందంటూ సర్టిఫై చేయడం ఈ అధికారులకు మాత్రమే చెల్లింది.
అగ్నిప్రమాదాలకు గురైన భవంతులు, పరిశ్రమలకు ఇన్సూరెన్స్‌లు రావాలంటే ఆ అధికారి మళ్లీ సర్టిఫై చేయాలి కాబట్టి..ఇక్కడ కూడా డిమాండ్ ఉంటోంది. దీంతో పోలీసులు, ఫైర్, ఇన్సూరెన్స్, సీఈఐజీ సిబ్బంది అంద రూ కుమ్ముక్కవుతున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ భవంతులకు ఎన్ఓసీ ఇవ్వడానికి సతాయిస్తున్న తనిఖీ విభాగం తమ చేయి తడిపిన వారికి మాత్రం వెంటనే ఇస్తున్నదన్న విమర్శలు కూడా ఉన్నాయి.