Gajularamaram | దుండిగల్, జూన్17: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం(సర్కిల్) డివిజన్ పరిధిలోని సర్వే నంబర్ 13లోని ప్రభుత్వ భూముల ఆక్రమణపై ఈనెల 12న ‘రాత్రికి రాత్రే కబ్జా’ పేరుతో ‘నమస్తే’లో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ మేరకు భూ ఆక్రమణలపై పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు భూ ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. భవిష్యత్లో మరోసారి ఆక్రమణలు జరగకుండా కఠిన చర్యలు చేపడుతామన్నారు. కాగా, కబ్జాకు గురైన సర్కారు భూములను మేడ్చల్ అదనపు డీసీపీ నర్సింహారెడ్డి, సూరారం సీఐ వెంకటేశంతో కలిసి సోమవారం పరిశీలించారు.
అక్రమ నిర్మాణాలు చేపట్టిన స్థలాన్ని పరిశీలించి.. రూ. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను ఆక్రమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరం పైచిలుకు స్థలాన్ని కాపాడటంతో పాటు అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూరారం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కబ్జాదారులు ఎంతటివారైనా ఉపక్షేంచొద్దని స్పష్టం చేశారు. సదరు భూమలును ఆక్రమించడంతో పాటు వాటిని ప్రోత్సహిస్తున్న శ్రీనాథ్, శోభారాణి, సంధ్యారెడ్డి, కుమారి, విజయ, శోభ, హేమాశ్రీలతో పాటు పలువురిపై కేసులు నమోదు చేయాలన్నారు. అక్రమార్కులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు.