బండ్లగూడ, ఏప్రిల్ 18 : ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధి సురంగల్ గ్రామ పరిసరాల్లోని ఓ ఫాంహౌస్‌లో ఐపీఎల్ 2023 ఆర్సీబీ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ క్రికెట్ మ్యాచ్‌పై బెట్టింగ్ జరుగుతుందని సమాచారం మేరకు రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు మొయినాబాద్ పోలీసులతో కలిసి దాడి చేశారు.
ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న మరొకరిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ కాస్తున్న తిరుపతయ్య, నాగరాజు, మల్లారెడ్డిలను అదుపులోకి తీసుకోగా ప్రధాన నిందితుడు శంకర్, భాస్కర్, సిద్ధు, మల్లి, సాయిరెడ్డి, భాష తప్పించుకున్నారు. పట్టుబడిన వారినుంచి ట్యాబ్, ఆరు స్మార్ట్ ఫోన్లతో పాటు రూ.40లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో రూ.13లక్షలు బ్యాంకులో నిల్వ ఉన్నట్లు తెలిపారు. నేరపూరితమైన చర్యలకు ఎవరైనా పాల్పడితే సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు వాట్సాప్ నంబర్ 9490617444కు వాట్సాప్ చేయాలని తెలిపారు.