సిటీబ్యూరో, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ) : హైటెక్స్ వేదికగా నిర్వహిస్తున్న క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలో రెండో రోజు శనివారం నగరవాసులు తరలివచ్చారు. తమ కలల సౌధాలను ఎంపిక చేసుకునేందుకు ఆసక్తి చూపించారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో కొత్తగా అందుబాటులోకి వస్తున్న ప్రాజెక్టులకు కొనుగోలుదారుల ఆసక్తి చూపించారు.
ఇక ధరలు కాస్త ఎక్కువ ఉండటంతో రెడీ టూ మూవ్ ప్రాజెక్టుల కంటే నిర్మాణ దశలోనే ఉన్న ప్రాజెక్టులే ఫస్ట్ హోమ్ బయ్యర్లు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని పలు నిర్మాణ సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. హైదరాబాద్లో పెట్టుబడికి ఇదొక గేట్ వేగా నిలుస్తుందన్నారు.
కాగా ఆదివారంతో రియాల్టీ ప్రదర్శన ముగియనున్నది. చివరి రోజు కావడంతో ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సందర్శకులకు అనువుగా ఉండేలా ఫుడ్ కోర్టులు, ఇంటరాక్టివ్ సెషన్లు, ప్రత్యేక సదస్సులను నిర్వహిస్తున్నట్లు క్రెడాయ్ హైదరాబాద్ ప్రతినిధులు పేర్కొన్నారు.