సిటీబ్యూరో, జనవరి 5(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా సర్కారు మన బస్త్తీ – మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం మాసబ్ ట్యాంకులోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని సమావేశ హాలులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన మన బస్తీ – మన బడి కార్యక్రమం అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, సాయన్న, కౌసర్ మొహినోద్దిన్, మౌజం ఖాన్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, డిప్యూటీ డీఈఓలు, ఇంజినీరింగ్ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మన బస్తీ – మన బడి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 690 పాఠశాలలు ఉండగా, 239 పాఠశాలలను ఎంపిక చేసినట్లు చెప్పారు. చేపట్టిన అభివృద్ధి పనులను డిప్యూటీ డీఈఓలు వారంలో 4 రోజుల పాటు పర్యవేక్షించాలన్నారు. పూర్తి వివరాలతో ఈ నెల 11న జరిగే సమావేశానికి రావాలని అధికారులను ఆదేశించారు.