కాప్రా, సెప్టెంబర్ 9 : మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని వివిధ మండలాల చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులను ఆక్రమించి బహుళ అంతస్తులను నిర్మించిన అక్రమార్కులను వెంటనే అరెస్టు చేసి, సదరు భూములను స్వాధీనం చేసుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.బాలమల్లేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈసీఐఎల్‌లోని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్లో సీహెచ్ దశరథ్ అధ్యక్షతన జరిగిన మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా సీపీఐ కౌన్సిల్ సమావేశానికి బాలమల్లేశ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలు, నాలాలు, పార్కు స్థలాలను రక్షించాలని, బాధ్యులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు.
జిల్లా పరిధిలోని కాప్రా చెరువు, యాప్రాల్ పరిధిలోని నాగిరెడ్డి చెరువు, బండబాయి కుంట, అల్వాల్ చిన్నరాయుడు చెరువు, కుత్బుల్లాపూర్ పరిధిలోని ఫాక్స్‌సాగర్ చెరువు, శామీర్‌పేట్ మండలం మెడిసిటీ హాస్పిటల్, బొమ్మరాసిపేట తదితర చెరువు స్థలాలను ఆక్రమించారని తెలిపారు. చెరువులు, కుంటల ఆక్రమణలను హైడ్రా కమిషనర్ తక్షణమే పరిశీలించి వాటిని తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి డిజి సాయిలు గౌడ్, సహాయ కార్యదర్శులు దామోదర్‌రెడ్డి, ఉమామహేశ్, కార్యవర్గ సభ్యులు దశరథ్, ఆర్.కృష్ణమూర్తి, ధర్మేంద్ర, రచచ కిషన్, శంకర్రావు, టి.శంకర్ తదితరులు పాల్గొన్నారు.