చిక్కడపల్లి, జనవరి 5 : కుల వ్యవస్థ భూతాన్ని అంతం చేస్తేనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. అఖిల భారత దళిత హక్కుల ఉద్యమం(ఏఐడీఆర్‌ఎం) 2వ మహాసభల ప్రారంభం సందర్భంగా ఆదివారం ఇందిరాపార్కు వద్ద బహిరంగ సభను నిర్వహించారు. దళిత హక్కుల పోరాట సమితి(డీహెచ్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కె.ఏసురత్నం ఆధ్యక్షతన జరిగిన ఈ సభకు డి.రాజా హాజరై ప్రసం గించారు.
భారత దేశంలో సామాజిక అభివృద్ధి, సంస్కరణలు, అభివృద్ధికి వేలాది ఏండ్లుగా పాతుకుపోయిన కుల వ్యవస్థ భూతం గా మారిందన్నారు. కుల వ్యవస్థ భూతాన్ని అంతం చేస్తే దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు. రాజ్యాంగ పరమైన పదవుల్లో ఉండి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడిన అమిత్ షా తన మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రూపొందించిన రాజ్యాంగం స్థానంలో మనువాదాన్ని అమలు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎంఎల్ కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. సమసమాజ స్థాపనతోనే అసమానతలు, నిర్మూలన సాధ్యం అవుతుందన్నారు. ఈ సభలో ఏఐడీఆర్‌ఎం జాతీయ అధ్యక్షుడు రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శి నిర్మల్‌కుమార్, బీకేఎంయూ జాతీయ ప్రధాన కర్యాదర్శి బోరియా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటీ నర్సింహా, ఎం.బాలనరసింహా, ఏఐడీఆర్‌ఎం జాతీయ నేతలు సుబ్బారావు, శివకుమార్, రవీంద్ర చారి, చాయదేవి, తదితరులు పాల్గొన్నారు.