CPIML | చిక్కడపల్లి, ఆగస్టు 22: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను, రైతులకు ప్రకటించిన రుణమాఫీని అర్హులైన వారందరికి అమలుచేయాలని, రైతు భరోసాకు నిధులు విడుదల చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం-ఎల్) మాస్‌లైన్ పార్టీ ఆధ్వర్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం, ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజాస్వామికవాది ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలో ప్రజాస్వామిక విలువలు ఉండాలన్నారు. ప్రజల కోరికలు ప్రభుత్వాలు నెరవేర్చాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. అనేక వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ముందు పెట్టి అధికారంలోకి వచ్చిందని, ఆ వాగ్దానాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. సీపీఐ(ఎం-ఎల్) మాస్‌లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించిందన్నారు.
తొమ్మిది నెలలు కావొస్తున్నా మహిళలకు ఒక్క ఆర్టీసీ బస్సు ఉచితం తప్ప వేటిని అమలు చేయలేదని మండిపడ్డారు. రైతు పంటలకు గిట్టుబాటు ధర కాకుండా బోనస్‌గా ఇస్తామన్న రూపాయిలు నేటికీ ఇవ్వలేదని, గిట్టుబాటు ధర లేక రైతులు సతమతవుతన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం 40 శాతం మాత్రమే చేయడం దేనికి నిదర్శనం అని ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్ చేయకపోవడం మూలంగా ఉన్న విద్య పేద, మధ్యతరగతి కుటుంబాలకు దక్కడం లేదని వివరించారు.
నిరుద్యోగ భృతి ఇస్తామని, జాబ్ క్యాలెండర్‌ని ప్రకటిస్తూ ఒక్క ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో పార్టీ సెక్రటేరియట్ సభ్యులు కె.రామచందర్, కె.రమ, గుమ్మడి నర్సయ్య, నాయకులు జి.వెంకటేశ్వర రావు, వి.కృష్ణ, వి.ప్రభాకర్, చన్ని చంద్రన్న, కే.సూర్యం, చండ్ర అరుణ, కృష్ణ, ఎం.హన్మేష్, ఎస్.ఎల్.పద్మ తదితరులు పాల్గొన్నారు.