సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లను శుక్రవారం రాచకొండ సీపీ సుధీర్‌బాబు పరిశీలించారు. క్రికెట్ మ్యాచ్‌కు వచ్చే వారి కోసం పార్కింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. స్టేడియం పరిసరాలలో రాకపోకలు సాగించే వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు శుక్ర, శనివారాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11.50 నిమిషాల వరకు ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ లిమిట్స్‌లో ఆంక్షలు కొనసాగుతాయన్నారు. ఈ నేపధ్యంలో చంగిచర్ల, బొడుప్పల్, ఫిర్జాదిగూడ నుంచి ఉప్పల్ వైపు వెళ్లే భారీ వాహనాలు హెచ్ఎండీఏ బాగ్హయత్ లేఔట్ మీదుగా నాగోల్ వైపు వెళ్లాలి. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లే వాహనాలు నాగోల్ మెట్రో స్టేషన్ హెచ్ఎండీఏ లేఔట్ నుంచి బొడుప్పల్, చంగిచర్ల క్రాస్‌రోడ్డు వైపు వెళ్లాలి.
తార్నాక నుంచి ఉప్పల్ వెళ్లే వాహనాలు హబ్సిగూడ క్రాస్ రోడ్డు నుంచి నాచారం, చర్లపల్లి వైపు వెళ్లాలి. రామంతాపూర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లే వాహనదారుల స్ట్రీట్ నెం.8 మీదుగా హబ్సిగూడ క్రాస్ నుంచి నాచారం వైపు వెళ్లాలని సీపీ
సూచించారు.