శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుం టూ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కల్గకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు. శ్రీరామ నవమి వేడుకలు, అదే రోజు ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్ ఉండడంతో బందోబస్తు ఏర్పాట్లకు సంబంధించి డీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులతో శుక్రవారం నేరెడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనర్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనే శోభాయాత్ర వంటి కార్యక్రమాలకు బందోబస్తు సమయాల్లో జాగ్రత్తగా వ్యవహారించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ విభాగపు అధికారులు, సిబ్బంది శోభాయాత్ర ఉరేగింపు సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఆదివారం ఉప్పల్‌లో క్రికెట్ మ్యాచ్ కూడా ఉండడంతో బందోబస్తు ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించాలన్నారు. స్టేడియం పరిసరాలలో ఉన్న సీసీ టీవీల ద్వారా నిరంతరం నిఘా పెంచాలన్నారు. ఈ సమావేశంలో డీసీపీలు పద్మజ, ప్రవీణ్‌కుమార్, నర్సింహారెడ్డి, అరవింద్‌బాబు, శ్రీనివాసులు, మల్లారెడ్డి, ఉషా విశ్వనాథ్, శ్యాంసుందర్ పాల్గొన్నారు.