సిటీ బ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): వ్యూస్ మాయలో పడి విలువలు మర్చిపోవద్దని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. వ్యూస్, లైక్స్‌తో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చిన్నారుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని సూచించారు. మైనర్లతో కొన్ని యూట్యూబ్ ఛానళ్లు చేస్తున్న ఇంటర్వ్యూలను ఉద్దేశించి ఆయన ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులతో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని, చిన్నారులు, యువతకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులను ఇంటర్వ్యూలు చేసిన సమాజాభివృద్ధికి పాటుపడాలని సూచించారు.
పిల్లలపై చేసే వీడియోలు బాలల హక్కుల ఉల్లంఘనతో పాట చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే పోక్సో, జువైనల్ జస్టిస్ చట్టాలను ఉల్లంఘించినట్లు భావిస్తామని స్పష్టం చేశారు. మైనర్లపై ఆ తరహా కంటెంట్ క్రియేట్ చేస్తే పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. తక్షణమే వాటిని తొలగించకున్నా, భవిష్యత్తులో అలాంటి కంటెంట్ అప్లోడ్ చేసినా చట్టప్రకారం కేసులు పెడతామని హెచ్చరించారు.