సిటీబ్యూరో, మార్చి 23(నమస్తే తెలంగాణ)/అబిడ్స్: హైదరాబాద్ నగరంలో శ్రీరామనవమి శోభాయాత్రను అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అధికారులు సమాయత్తమయ్యారని , శోభాయాత్రను విజయవంతం చేయడానికి మూడువేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. సోమవారం సీతారామ్‌బాగ్‌లోని ద్రౌపది గార్డెన్స్‌లో నిర్వహించిన అధికారుల సమన్వయ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్‌లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శోభాయాత్ర ఏర్పాట్లు, తీసుకోవల్సిన చర్యలు, బందోబస్తు తదితర అంశాలపై సిబ్బందికి సీపీ దిశానిర్దేశం చేశారు. 2010లో ప్రారంభమైన శ్రీరామనవమి శోభాయాత్ర అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సీతారాంబాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు సాగే ఈ వేడుకను భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో జరుపుకోవాలని కోరారు. భద్రత కోసం సుమారు మూడువేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, అడుగడుగునా సీసీ కెమెరాలు, డ్రోన్ల నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా చైన్ స్నాచింగ్ వంటి నేరాలు జరగకుండా క్రైమ్ టీమ్స్, మహిళల రక్షణ కోసం షీటీమ్స్ నిరంతర నిఘా ఉంచుతాయని తెలిపారు.
గతేడాది వాహనాల బ్రేక్‌డౌన్ వల్ల యాత్ర నెమ్మదించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈసారి అలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులను సీపీ ఆదేశించారు. శోభాయాత్రను మధ్యాహ్నం ఒంటిగంటకల్లా ప్రారంభించాలని, ఇరుకైన మార్గాల్లో పెద్ద వాహనాల వల్ల ఇబ్బంది తలెత్తకుండా ముందస్తుగా ట్రయల్న్ నిర్వహించాలని నిర్వాహకు లకు సజ్జనార్ సూచించారు. శబ్ధకాలుష్యం వల్ల కలిగే ఆరోగ్యసమస్యలను దృష్టిలో ఉంచుకుని డీజేలకు బదులుగా సాధారణ సౌండ్ సిస్టమ్ వాడాలని, ఇతర వర్గాల మనోభావాలు దెబ్బతినకుండా పాటలు, ప్రసంగాలు ఉండాల ని స్పష్టం చేశారు. ప్రైవేటు వ్యక్తులు డ్రోన్లు వాడాలనుకుంటే పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సజ్జనార్ చెప్పారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ మాట్లాడుతూ… భక్తులకు అసౌకర్యం కలగకుండా రోడ్ల మరమ్మత్తులు, వీధిదీపాల ఏర్పాటును ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు. శోభాయాత్రలో పాల్గొనే వాహనాల ఎత్తు విషయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో శోభాయాత్ర నిర్వాహకులు భగవంతరావు, గోవింద్ రాఠి, ఆనంద్‌సింగ్, కృష్ణ, మాజీ కార్పొరేటర్లు శశికళ, లాల్‌సింగ్, తదితరులు శోభాయాత్ర సందర్భంగా ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించగా వాటిని పరిష్కరిస్తామని సీపీ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా శోభాయాత్ర నిర్వాహకులు డాక్టర్ భగవంతరావు, గోవిందరాఠి, మాజీ కార్పొరేటర్లు పరమేశ్వరిసింగ్, లాల్‌సింగ్, ఎం.శశికళ కృష్ణ, నాయకులు ఆనంద్‌సింగ్ తదితరులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు రాగా సమస్యలను పరిష్కరిస్తామని పోలీస్ కమిషనర్ సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌లు అన్నారు. అనంతరం సీతారాంబాగ్ నుంచి ప్రారంభమై సుల్తాన్‌బజార్ హనుమాన్ టేక్డీ వరకు కొనసాగే శోభాయాత్ర రూట్‌ను నగర సీపీ వీసీ సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తో పాటు ఇతర శాఖల అధికా రులతో ఓపెన్ టాప్ జీపులో పర్యవేక్షించారు.
ఈ సమా వేశంలో జాయింట్ కమిషనర్లు తౌఫిక్ ఇక్బాల్, జోయల్ డేవిష్, శ్వేత, డీసీపీలు శిల్పవల్లి, శ్రీనివాస్, కిరణ్ ఖరే, గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్, అదనపు కమిషనర్ అందె శ్రీనివాస్, గోషామహల్ ఏసీపీ సుదర్శన్, కుల్సుంపురా ఏసీపీ తిరుపతి, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ రవికిరణ్, జీహెచ్ఎంసీ గోల్కొండ జోన్ జోనల్ కమిషనర్ ము కుందరెడ్డి, జీహెచ్ఎంసీ 30వ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఉమా ప్ర కాశ్, టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి మహేందర్, వాటర్ వర్క్స్ సీజీఎం ప్రభు, ఇతర శాఖల అధికారులు, ఉత్సవ సమితి నిర్వాహకులు పాల్గొన్నారు.