సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ‘పోయిన సొత్తు ఇక దొరకదు’ అన్న భావనను సైబరాబాద్ పోలీసులు చెరిపేస్తున్నారు. బాధితులు ఫిర్యాదులు చేయడమే ఆలస్యం.. కేసు నమోదు.. ఆపై దర్యాప్తు.. వెంటనే ఛేదించి.. చోరీ సొత్తును రికవరీ చేస్తూ వెనువెంటనే బాధితులకు అందిస్తున్నారు. వారి కండ్లల్లో ఆనందం నింపుతున్నారు. మంగళవారం సైబరాబాద్ పోలీసులు 130 కేసులకు సంబంధించి దాదాపు రూ.1.25 కోట్ల సొత్తును రికవరీ చేసి సైబరాబాద్ సీపీ సజ్జనార్ చేతుల మీదుగా బాధితులకు అందించారు. గత మూడు నెలల కాలంలో మాదాపూర్, బాలానగర్, శంషాబాద్ జోన్ల పరిధిలోని పోలీస్స్టేషన్లలో 130 కేసులు నమోదయ్యాయి.
ఈ కేసులను ఛేదించిన పోలీసులు మొత్తం 80 తులాల బంగారం, 9 కేజీల వెండి ఆభరణాలు, 63 వాహనాలు, 39 ఫోన్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎమ్ విజయ్‌కుమార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గత నెలలో కూడా సైబరాబాద్ పోలీసులు రూ.1.75 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకొని బాధితులకు అందించారు. పోలీసులు చేస్తున్న ఈ మంచి పనిని ప్రతిఒక్కరూ మెచ్చుకుంటున్నారు.
ఒంటరిగా జీవిస్తున్న నేను ఇంటికి తాళం వేసి రోడ్డు మీదకి వెళ్లా. తిరిగి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఇంట్లోని రూ.30 వేల నగదు, 8 గ్రాముల బంగారం దోచుకెళ్లారు. వెంటనే జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశా. స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి సొత్తు దొరుకుతుందని భరోసా ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత పోలీసులే స్వయంగా ఫోన్ చేశారు. బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు ఇచ్చారు. ఎంతో ఆనందంగా ఉంది. పోలీసులపై నమ్మకం పెరిగింది. – ముత్యాలు, జీడిమెట్ల
మాది ఒడిసా. గత నెలలో మియాపూర్ వద్ద బైక్ పార్క్ చేసి సామాను కొనుగోలు చేసేందుకు వెళ్లా. అంతలోనే ఎవరో తాళం విరగగొట్టి బండిని ఎత్తుకెళ్లారు. మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే మూడు రోజుల్లో బండి తెచ్చి ఇచ్చారు. మా రాష్ట్రంలో కంటే ఇక్కడ పోలీసింగ్ వ్యవస్థ బాగుంది. -బిస్వా రంజన్, మియాపూర్
స్నేహితురాలితో కలిసి వాకింగ్ వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తి చైన్ తెంపుకొని పారిపోయాడు. వెంటనే 100కు ఫోన్ చేయగా నిమిషాల్లో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు గంటల్లో గొలుసు తెంపుకు పోయిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. మూడు తులాల బంగారాన్ని తిరిగి ఇచ్చారు. సైబరాబాద్ పోలీసులు ఎంతో బాగా పని చేస్తున్నారు. -అన్నపూర్ణ, మియాపూర్
ప్రజల భద్రతే ముఖ్యం..
ప్రజల భద్రతే మా బాధ్యత. చోరీ కేసులను ఛేదించేందుకు కమిషనరేట్ పరిధిలో ప్రత్యేకాధికారులను నియమించాం. కోర్టు అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధితులకు సత్వరమే చోరీ సొత్తును అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఈ ఏడాది 65 శాతం రికవరీని సాధించాం. చోరీ సొత్తు రికవరీ ప్రక్రియను నిరంతరం కొనసాగించే దిశగా చర్యలు చేపట్టాం. – సజ్జనార్, సైబరాబాద్ సీపీ