ఖైరతాబాద్, ఆగస్టు 25: నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. ఎలైట్, హాఫ్, ఫుల్ మారథాన్‌ను ముఖ్య అతిథిగా హాజరైన నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ఎన్ఎండీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జయపాల్ రెడ్డి, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ నారాయణ టీవీ, రేస్ డైరెక్టర్ రాజేశ్ వేచ్చతో కలిసి ఆదివారం ప్రారంభించారు.
ఈ రన్ పీపుల్స్ ప్లాజా నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, రాజ్‌భవన్ రోడ్, జూబ్లీహిల్స్ మీదుగా గచ్చిబౌలి వరకు సాగింది. సీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దైనందిన జీవితంలో యువత సరైన వ్యాయామం లేక, కల్తీ, జంక్ ఫుడ్ తీసుకుంటూ అనారోగ్యాల పాలవుతున్నారని అన్నారు. 60 నుంచి 70 ఏండ్ల వయస్సులో రావాల్సిన జబ్బులు 20 ఏండ్లకే వస్తున్నాయన్నారు. ఇలాంటి రన్లు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కావాలన్నారు.