Bakrid 2025 | సిటీబ్యూరో, మే 27(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని నగర సీపీ సీవీ ఆనంద్ కోరారు. ఈ మేరకు పండుగ నేపథ్యంలో మంగళవారం పలు ప్రభుత్వ శాఖలు, మతపెద్దలతో హైదరాబాద్ సిటీ పోలీసులు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీపీ సీవీ ఆనంద్ అధ్యక్షత వహించి.. నగరంలో బక్రీద్ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. జంతువుల అక్రమ రవాణాను అరికట్టడానికి భద్రతా కారణాల దృష్ట్యా కమిషనరేట్ చుట్టూ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు.
ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ విక్రమ్మాన్సింగ్, జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ రఘుప్రసాద్, ఖైరతాబాద్ ఆర్టీవో 2 డాక్టర్ మల్లేశ్వరి, పశుసంవర్థకశాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ బాబు బేరి, రంగారెడ్డి జిల్లా వెటర్నరీ అధికారి సోమిరెడ్డి, ఎమ్మెల్యేలు మజిద్హుస్సేన్, కౌసర్ మోహియుద్దీన్, జుల్ఫికర్ అలీ, జాఫర్ హుస్సేన్ మేరాజ్, ఎమ్మెల్సీ మీర్జారహమత్ అలీబేగ్, మతపెద్దలు, ఖురేషీలు, మౌలాన, తదితరులు పాల్గొన్నారు.