సిటీబ్యూరో, సెప్టెంబర్ 5, (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళాఅశ్వికదళం ఏర్పాటుచేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మహిళా హార్స్రైడర్స్ను గోషామహల్ గ్రౌండ్లో శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్ ప్రవేశపెట్టారు. పదిమంది సాయుధ రిజర్వ్మహిళా కానిస్టేబుళ్లు రెండునెలలపాటు గోషామహల్ మౌంటెడ్ యూనిట్లో శిక్షణ పొంది, ఇప్పుడు గుర్రపు పోలీసు దళంలో భాగమయ్యారు.
ఈ సందర్భంగా అశ్వికదళం చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. దేశంలోనే ఇదొక కీలకమైన నిర్ణయమని కమిషనర్ ఆనంద్ పేర్కొన్నారు. మహిళలు అన్నిరంగాల్లో ముందుకు రావాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, మహిళా మౌంటెడ్ పోలీసులు గస్తీలో మొదటిసారిగా పాల్గొనబోతున్నారని ఆయన తెలిపారు. ఈ మహిళా కానిస్టేబుళ్లను బందోబస్తు, వీఐపీల భద్రత, పెట్రోలింగ్ వంటి విధులకు వినియోగిస్తారు. మరోవైపు హైదరాబాద్ నగరపోలీసులు తమ డాగ్‌స్కాడ్‌ను కూడా విస్తరిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న 34శునకాలకు అధిక పనిభారం అవుతున్నందున ఈ సంఖ్యను 54కు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అదనపు శునకాలను ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో విస్తృత శిక్షణ పొందిన తర్వాత డాగ్‌స్కాడ్ బృందంలో చేర్చుకుంటామని పోలీసులు తెలిపారు. శునకాల నాణ్యత మెరుగుపరచడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ దేశవ్యాప్తంగా ఉన్న డాగ్ బ్రీడర్ల నుంచి నాణ్యమైన శునకాలను ఎంపిక చేస్తుందని సీపీ సీవీ.ఆనంద్ తెలిపారు.
అందులో భాగంగా మొదటి దశలో 12 శునకాలను సేకరించామని, భవిష్యత్‌లో మరిన్ని సేకరించనున్నట్లు ఆయన చెప్పారు. నూతన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి ఇటీవల పరిణామాల నేపథ్యంలో గోషామహల్ పోలీస్స్టేడియం ఆవరణలోని గుర్రపు మైదానం, అశ్వశాలలను కొత్తప్రదేశానికి మార్చబోతున్నామని, ఈ ప్రాజెక్ట్‌లో సిటీ సెక్యూరిటీ వింగ్ కోసం కొత్త భవనాలు, స్వాధీనం చేసుకున్న వాహనాల నిలుపుదల ప్రదేశాలు, కొత్త గుర్రపుశాలలు, పెరేడ్ గ్రౌండ్ ఉంటాయని ఆయన తెలియజేశారు. 11.5ఎకరాల విస్తీర్ణంలో 60 శునకాల కోసం డాగ్కెనాల్స్, మౌంటెడ్ యూనిట్‌ను నిర్మిస్తామని, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టెండర్లు ఈనెల8న పూర్తవుతాయని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కార్ హెడ్‌క్వార్టర్స్ రక్షిత కృష్ణమూర్తి, సౌత్‌వెస్ట్‌జోన్ డీసీపీ చంద్రమోహన్, సైబర్ క్రైమ్ డీసీపీ దారా కవిత, సీఎస్‌డబ్ల్యూ డీసీపీ గిరిరాజు తదితరులు పాల్గొన్నారు.