సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): మత సామరస్యాన్ని కాపాడుతూ హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణం కల్పించడంలో పీస్ కమిటీ సభ్యులు పోలీసులకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. నగరంలోని ఆయా జోన్లకు చెందిన సెంట్రల్ పీస్ కమిటీకి చెందిన 500 మంది సభ్యులతో బంజారాహిల్స్‌లోని టీఎస్ పీఐసీసీసీ ఆడిటోరియంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. శాంతి కమిటీలోని ఐటీ విభాగాల ద్వారా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో జరిగే తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించే విధంగా అప్రమత్తంగా ఉండాలన్నారు.
పండుగలు, ఊరేగింపుల సమయంలో వదంతులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని, వాటిని గుర్తించి ఎప్పటిప్పుడు తొలగిస్తూ ప్రజలకు వాస్తవాలు తెలిపే విధంగా శాంతి కమిటీ సభ్యులు పనిచేయాలన్నారు. జోనల్, పోలీస్‌స్టేషన్ స్థాయిలో ఉండే శాంతి కమిటీలు క్షేత్ర స్థాయిలో ఉండే సమస్యలను తీసుకొని వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట, మహిళల భద్రత, ట్రాఫిక్, సైబర్ క్రైమ్ సమస్యలపై కూడా తగిన సహకారం అందించాలన్నారు. శాంతి కమిటీ సభ్యులు పరస్పరం సహకరించుకోవాలన్నారు. సమాజంలో కేవలం 0.1 శాతం మంది మాత్రమే శాంతికి విఘాతం కల్గించడానికి ప్రయత్నిస్తుంటారని, అలాంటి వారిని అందరు కలిసికట్టుగా ఎదుర్కోవాలన్నారు. నగర ఖ్యాతిని పరిరక్షించడంలో శాంతి కమిటీ సభ్యులు నిరంతరం కృషి చేయాలని కోరారు. కేంద్ర శాంతి కమిటీ ప్రధాన కార్యదర్శి కృష్ణశర్మ మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాల శాంతి కమిటీ సేవలను గుర్తు చేశారు. ఈ సమావేశంలో అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్ (శాంతి కమిటీ చైర్మన్), అదనపు సీపీ విశ్వప్రసాద్, డీసీపీలు, తదితరులు పాల్గొన్నారు.