సిటీబ్యూరో, నవంబర్ 28(నమస్తే తెలంగాణ): కేసుల విచారణను వేగవంతం చేసి, నిందితుల అరెస్టులో జాప్యం లేకుండా చూడాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి అన్నారు. గురువారం బాలానగర్ జోన్‌కు సంబంధించి నిర్వహించిన క్రైమ్ సమీక్షా సమావేశంలో సీపీ పలు అంశాలపై సమీక్షించారు. జోన్ పరిధిలో నమోదై ఉన్న అన్ని కేసులకు సంబంధించిన స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ బాలానగర్ జోన్ అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు, 174సెక్షన్‌కు సంబంధించిన కేసుల దర్యాప్తు వేగవంతం చేసి ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ట్రయల్స్ నడుస్తున్న కేసులకు సంబంధించి చార్జీషీట్ నంబర్లను భద్రంగా ఉంచాలని, అందుకోసం న్యాయనిపుణులతో సమన్వయంగా కలిసి పని చేయాలన్నారు. కిడ్నాప్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి సకాలంలో చర్యలు తీసుకుని న్యాయం జరిగేలా చూడాలన్నారు. నాన్‌బెయిలబుల్ వారెంట్లు, మిస్సింగ్ కేసులు, మహిళలు, పిల్లలకు సంబంధించిన కేసుల పరిష్కారంపై సీపీ సమీక్షించారు.
ముఖ్యంగా సైబర్ నేరాలను ఎదుర్కొని, మోసాలను నిరోధించేందుకు ప్రజల్లో అవసరమైన అవగాహన కల్పించాలన్నారు. తరచూ నేరాలకు పాల్పడుతూ నేరాలను పునరావృతం చేసే నేరస్తులపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని సూచించారు. నివాసాలు, వ్యాపార సముదాయాలు తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రజలను ప్రోత్సహించాలని, సీసీ ఫుటేజీలు న్యాయస్థానాల్లో నేరారోపణల నిర్ధారణకు కీలక సాక్ష్యాలుగా పని చేస్తాయన్నారు. సమావేశంలో బాలానగర్ డీసీపీ కె.సురేశ్‌కుమార్, క్రైమ్ డీసీపీ కె.నర్సింహ, ఎస్బీ డీసీపీ సాయిశ్రీ, సైబర్‌క్రైమ్ డీసీపీ శ్రీబాలాదేవి, ఎస్ఓటీ డీసీపీ డి.శ్రీనివాస్‌గుప్త తదితరులు పాల్గొన్నారు.