సిటీబ్యూరో, జూన్ 14,(నమస్తే తెలంగాణ): గాంధీ జనరల్ ఆసుపత్రి.. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఈ పేరు తెలియనివారంటూ ఉండరు. ఎంతపెద్ద రోగమైన గాంధీ మెట్లెక్కితే చాలు ఆరోగ్యవంతంగా తిరిగొస్తామనే ధీమా ఉండేది. కానీ అదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం గాంధీ అంటేనే సమస్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. సకాలంలో క్లిష్టమైన వైద్యసేవలందించడంలో రోజురోజుకు విఫలమవుతున్నది. ఏఎంసీ వార్డులో వెంటిలేటర్లు కూడా అమర్చలేని స్థితికి నేడు ఈ ఆసుపత్రి చేరింది. ఏఎంసీ వార్డులోనే కొవిడ్ రోగులను, ఇతర రోగులతో కలిపి వైద్యమందిస్తుండటం ఆందోళనను రేకెత్తిస్తున్నది.
1200 పడకలు గల ఈ ఆసుపత్రిలో సరిపడా సిబ్బంది లేకపోవడం ఒక కారణమైతే, క్రిటికల్ ట్రీట్మెంట్ అందించే రోగులకు నాణ్యమైన వైద్యమందించకపోవడం మరో కారణం. గాంధీ ఆసుపత్రిలో మూడో ఫ్లోర్లో ఉన్న అక్యూట్ మెడికల్ కేర్(ఏఎంసీ) వార్డులో తీవ్రమైన అస్వస్థతకు గురైన వారికి వెంటిలేషన్‌పై చికిత్సనందిస్తుంటారు. శ్వాసకోశ సమస్యలు, లివర్ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ, తీవ్రమైన అస్వస్థతకు గురైన వారందరికీ ఏఎంసీ వార్డులోనే వెంటిలేటర్‌పై అత్యవసర వైద్యమందిస్తారు 68 పడకలకు గాను కేవలం 23 మాత్రమే వెంటిలేటర్లు ఉండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
బయోమెడికల్ ఇంజినీర్ గతంలో వాటిని ఎప్పటిప్పుడు సర్వీస్ చేస్తుండేవారు. ప్రస్తుతం ఆ పోస్టు ఖాళీగా ఉండటంతో పాడైపోయిన మెషిన్లను స్టోర్ రూంకు పరిమితం చేశారు. మరోవైపు రోగులు తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ వెంటిలేటర్ సహాయం కోసం ఎదురుచూసినా ఫలితం శూన్యంగా మారింది. కేవలం 23 మందికే ఆ సేవలందిస్తూ, మిగతా వారిని క్యాజ్వాలిటీలోనే పెట్టి తూతూ మంత్రంగా వైద్యమందిస్తున్నారు.
గాంధీ ఆసుపత్రి కొవిడ్ నోడల్ కేంద్రంగా కూడా వైద్యసేవలందిస్తుంది. ఇప్పటికే కొవిడ్ వచ్చినా కూడా తట్టుకుంటామని 30 పడకలతో కొవిడ్ వార్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో కొవిడ్ కమిటీ సైతం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా కొవిడ్ లక్షణాలతో గాంధీకి వచ్చే రోగులను కొవిడ్ వార్డులో ఉంచి వైద్యమందించకుండా ఏఎంసీ వార్డులో పెట్టి వైద్యమందించడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఇతర రోగులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఇద్దరు కొవిడ్ రోగులను ఏఎంసీ వార్డులో పెట్టి వైద్యసేలందిస్తున్నారు.
అసలే శ్వాస సంబంధిత వ్యాధులతో వచ్చేవారు అధికంగా ఉన్న వార్డది. అలాంటి వారితో కొవిడ్ బాధితులు ఉంటే పెనుప్రమాదమే పొంచి ఉంటుంది. వారినుంచి ఇతర రోగులకు వ్యాప్తి చెంది వారి ప్రాణాలకే ముప్పువాటిల్లుతుంది. మరోవైపు వైద్యసేవలందించేవారికి కనీసం సరిపడ మాస్కులు, శానిటేషన్ కూడా ఇవ్వకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గడిచిన నాలుగు నెలల్లో గాంధీ ఆసుపత్రిని వైద్యారోగ్యశాఖ మంత్రి ఒక్కసారి, డీఎంఈ ఐదుసార్లకు పైగా పర్యటించారు. ఇప్పటికైనా ఆస్పత్రిలో సమస్యలను గుర్తించి చర్యలు చేపట్టాలని రోగుల బంధువులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.