సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): పోలీస్స్టేషన్ల నుంచి కోర్టు విధులు నిర్వహించే కొందరు కానిస్టేబుల్స్ అదే స్థానంలో పాతుకుపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇలా పాతుకుపోతున్న కొందరు సిబ్బంది నిందితులకు మేలు చేసే విధంగా బాధితులతో బలవంతంగా కేసులను రాజీ కుదురుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్‌స్టేషన్‌కు, కోర్టులకు వారధిగా ఉంటూ నిందితులను కోర్టుకు తీసికెళ్లడం, ఠాణాల నుంచి కోర్టుకు వెళ్లాల్సిన పత్రాలను వేగంగా చేరవేయడం, సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టడం, సమన్లు, వారెంట్లు జారీ చేయడం వంటి తదితర విధులను కోర్టు కానిస్టేబుల్స్ నిర్వహిస్తుంటారు.
ఇందుకు కోర్టు మానిటరింగ్ సిస్టమ్ పోలీస్‌స్టేషన్ నుంచి పనిచేస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీస్స్టేషన్లలోని ఆయా విభాగాలకు సంబంధించిన పనులను విభజించి వేగంగా ఆయా పనులు జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఆయా విభాగాల బాధ్యతను సిబ్బందిని కేటాయిస్తూ వేగంగా, జవాబుదారి తనంతో సిబ్బంది పనిచేసే విధంగా వర్టికల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.
ఆయా విభాగాలకు సంబంధించిన విధులను తరుచూ మారుస్తూ సిబ్బందికి అన్ని రకాల విధులలో పట్టు వచ్చే విధంగా ఆయా ఠాణాలలో చర్యలు తీసుకుంటూ విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచేవారిని అధికారులు ప్రోత్సహిస్తుంటారు. ఈ క్రమంలోనే చాలా వరకు కోర్టు విధులు నిర్వహించే సిబ్బంది కూడా మారుతూ ఉంటారు. చాలా వరకు రెండు, మూడేండ్లకు మారుతూ అందరికీ అన్ని విభాగాలపై పట్టువచ్చే విధంగా విధులు కేటాయింపు చేస్తుంటారు.
ఈ క్రమంలోనే కొందరు సిబ్బంది మాత్రం ఏండ్లు గడుస్తున్నా కోర్టు విధుల్లోనే ఉంటూ అక్కడే పాతుకుపోతున్నారని డిపార్టుమెంట్‌లోని సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఇంకా కొందరు ఒక ఠాణా నుంచి మరో ఠాణా కు బదిలీ అయినా గతంలో నిర్వహించిన కోర్టు విధులు నిర్వహిణకే మొగ్గుచేపుతుంటారని, ఇలాంటి వారు ఎక్కడకు వెళ్లినా కోర్టు విధులే నిర్వహిస్తుంటారని, అవసరమైతే కొన్నిసార్లు పోలీస్‌స్టేషన్ అధికారులకు సిఫారస్లు కూడా చేయించుకుంటారని సమాచారం.
కేసుల పరిష్కారంలో కీలకం
ఆయా ఠాణాల్లోని కేసులు కోర్టుల ద్వారా త్వరగా పరిష్కారమయ్యే విధంగా ఆ విభాగం సిబ్బంది పని చేస్తుంటారు. చట్ట ప్రకారం వీలైనంత వరకు రాజీకి అవకాశమున్న కేసుల్లో రాజీ కుదిరించేందుకు కూడా ప్రయత్నిస్తుంటారు. ఇందుకు లోక్ అదాలత్‌లు ఏర్పాటు చేసిన సమయంలో కోర్టు సిబ్బంది ఆయా కేసుల్లో ఇరువర్గాలతో మాట్లాడి చట్టప్రకారం వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటూ కీలక పాత్ర పోషిస్తుంటారు.
ఇంత వరకు బాగానే ఉంటుంది. అయితే అక్కడే పాతుకుపోయే కొందరు కానిస్టేబుళ్లు మాత్రం నిందితులతో మాట్లాడుకుంటూ ఆయా కేసుల్లోని బాధితులతో బలవంతంగా రాజీ కుదురుస్తున్నారంటూ ఆరోపణలు సైతం విన్పిస్తున్నాయి. రాజీకి అవకాశం లేకుంటే, బాధితులు, సాక్ష్యులు కోర్టుకు వెళ్లకుండా చేసేవాళ్లు కూడా ఉన్నట్లు ఆరోపణలున్నాయి.
లైజనింగ్ అధికారిగా ఉంటూ..!
రాచకొండలోని ఎల్బీనగర్ జోన్లో ఓ హెడ్‌కానిస్టేబుల్ గతంలో పని చేసినప్పుడు కోర్టు విధులు నిర్వహించాడు. ఆయనకు అటూ కోర్టు, ఇటూ పోలీసు అధికారులతో మంచి పరిచయాలు ఏర్పడటంతో ఒక చోట నుంచి మరో చోటకు మారినా ఆయనకు ఎక్కువగా కోర్టు విధులే అప్పగించేవారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా కేసులను రాజీ చేస్తున్నాడని, ఆయన పని చేస్తున్న ఠాణాకు వచ్చే కేసుల విషయంలో దూరి తమ వారికి కేసులను వాదించేందుకు ఇప్పిస్తున్నాడంటూ ఆరోపణలు రావడంతో కొందరు న్యాయవాదులు సైతం ఉన్నతాధికారులు, పైకోరుల్టకు ఫిర్యాదులు చేసిన ఘటనలున్నట్లు సమాచారం.
దీంతో ఆయనను అక్కడి నుంచి హెడ్‌క్వార్టర్స్‌కు అధికారులు అటాచ్ చేసినట్లు తెలిసింది. కొన్నాళ్లు అక్కడ పనిచేసి తిరిగి ఎల్బీనగర్ జోన్‌కే వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తరువాత ఓ డివిజన్‌కు లైజనింగ్ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ఉన్నతాధికారుల దృష్టిలో కోర్టు విధులు బాగా నిర్వహించే అధికారి అనే భావన తీసుకొచ్చాడు. ఆ తరువాత ఆయన ఈ విధులను ఒక ఆదాయ వనరుగా మార్చేసుకున్నాడనే విమర్శలున్నాయి. కొన్ని కేసుల్లో నిందితుల తరపున ఆయనే స్వయంగా వకాలత్ పుచ్చుకొని కేసులను రాజీ చేయిస్తున్నాడని ఆరోపణలున్నాయి.
ఇలా కేవలం ఎల్బీనగర్ జోన్లోనే పలు కేసులు రాజీకుదిర్చినట్లు సమాచారం.నిందితులతో మాట్లాడుకొని, ఆయా కేసుల్లో బాధితులకు ఎంతో కొంత డబ్బు ఇప్పిస్తూ, వచ్చిన దాంట్లో తాను 10 శాతం కమీషన్ తీసుకుంటున్నాడనే ఆరోపణలున్నాయి. ఇలా రాజీకి వీలులేని కేసుల్లో బాధితులను కోర్టు వరకు రాకుండానే బయటే సెటిల్ చేస్తుంటాడని, ఆయన మాటలు వినని వారిని బెదిరిస్తుంటాడనే ఆరోపణలు వస్తున్నాయి. దొంగతనం, చీటింగ్, మహిళలను వేధించిన తదితర కేసుల్లో ఆయన బలవంతంగా రాజీలకు ప్రయత్నిస్తుంటాడనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ లైజనింగ్ అధికారిపై ఉన్నతాధికారులు అంతర్గత విచారణ జరిపితే అన్ని విషయాలు బయటపడుతాయంటూ పేరు చెప్పడానికి ఇష్టపడని బాధితులు సూచిస్తున్నారు.