బొల్లారం, జనవరి 1 : ఆర్టీసీ బస్సు ఢీకొని దంపతులు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకా రం.. నిర్మల్ జిల్లాకు చెందిన తునికి తులసీదాస్(65), రాజమణి(62) దంపతులు. వీరి కుమారుడు తునికి రామరాజు గచ్చిబౌలిలో ఉంటూ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. గచ్చిబౌలిలో ఉంటున్న కుమారుడిని చూసేందుకు నిర్మల్ నుంచి తులసీదాస్ దంపతులు ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్కు బస్సులో వచ్చి బోయిన్పల్లి చౌరస్తాలో దిగారు.
ఈ దంపతులు గచ్చిబౌలి వెళ్లేందుకు బాలానగర్ వైపు వెళ్లే బస్టాప్ వద్దకు రోడ్డు దాటి వెళ్తున్నారు. ఇదే సమయంలో వెనక నుంచి అతివేగంగా వచ్చిన జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఈ దంపతులను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, దంపతుల వద్ద ఉన్న సెల్ఫోన్ ఆధారంగా కుమారుడికి ఫోన్ చేసి విషయం తెలిపారు. ఘటనా స్థలానికి వచ్చిన కుమారుడు.. తల్లితండ్రుల మృతదేహాలను చూసి బోరున విలపించాడు. ఆర్టీసీ బస్ డ్రైవర్ నరహరి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. కుమారుడు రామరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.