జీహెచ్ఎంసీ పాలకమండలికి కౌంట్ డౌన్ మొదలైంది. ప్రస్తుత కౌన్సిల్ పదవీకాలం మరో 15 రోజుల్లో ముగియనున్నది. వచ్చే నెల ఫిబ్రవరి 10తో మేయర్, డిప్యూటీ మేయర్‌తో కూడిన 150 మంది కార్పొరేటర్ల పదవీకాలం ముగుస్తున్నది. ఫిబ్రవరి 11 నుంచి గ్రేటర్ పాలనలో సరికొత్త అధ్యాయం మొదలుకానున్నది. ప్రజా ప్రతినిధుల స్థానంలో ప్రత్యేక అధికారి పాలన అమల్లోకి రాబోతున్నది. జీహెచ్ఎంసీలోకి 27 పురపాలికల విలీనంతో 150 నుంచి 300 వార్డులు, ఆరు జోన్లు కాస్తా 12 జోన్లు, 30 నుంచి 60 సర్కిళ్లుగా చేసిన అధికారులు, ఫిబ్రవరి 10 తర్వాత మహా జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించి పాలన అందించేందుకు సర్కారు ఇప్పటికే అన్ని చర్యలు పూర్తి చేసింది. ప్రస్తుత జీహెచ్ఎంసీ తో పాటు గ్రేటర్ మల్కాజ్గిరి మున్పిపల్ కార్పొరేషన్ ఉంటుందా? లేదా సికింద్రాబాద్ పేరుతో ఏర్పాటు చేస్తారా? అన్నది చూడాల్సి ఉంది. మూడవ కార్పొరేషన్‌గా గ్రేటర్ సైబరాబాద్ మున్పిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయనున్నారు. జీహెచ్ఎంసీని ప్రస్తుత ప్రధాన కార్యాలయ కేంద్రంగా, సైబరాబాద్ కార్యాలయం మాదాపూర్ న్యాక్‌లో, మల్కాజ్గిరి కార్యాలయం తార్నాక హెచ్ఎండీఏ కార్యాలయ కేంద్రంగా పాలన అందించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
– సిటీబ్యూరో
ఈ నెల 31న కౌన్సిల్ ?
ప్రస్తుత పాలక మండలి గడువు ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో వారానికి ఒకసారి జరగాల్సిన స్టాండింగ్ కమిటీ సమావేశాలు మరో రెండు, బడ్జెట్ సందర్భంగా ఒక కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 29న స్టాండింగ్ కమిటీ సమావేశానికి, 31న కౌన్సిల్ సమావేశానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో దాదాపు రూ. 11,460 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలను కౌన్సిల్ ఆమోదించనున్నది. ఫిబ్రవరి మొదటి వారంలో ఎజెండాలను బట్టి మరో స్టాండింగ్ కమిటీ సమావేశం చివరగా జరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ముగిసిన తర్వాత తదుపరి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై స్పష్టత లేదు. వార్డుల విభజన, ఓటర్ల జాబితా తయారీ వంటి సాంకేతిక ప్రక్రియలకు కనీసం మూడు నుంచి ఐదు నెలల సమయం పట్టేలా ఉంది.
కుంటుపడిన పాలన..
జీహెచ్ఎంసీలో 27 పురపాలికల విలీన ప్రక్రియ నుంచి దాదాపు రెండు నెలలుగా పాలన కుంటుపడింది. పురోగతిలో ఉన్న పనులు ఎక్కడికక్కడే నిలిచిపోగా..కొత్త ప్రాజెక్టు చేపట్టింది లేదు.. జనన, మరణ ధ్రువీకరణపత్రాల జారీ నుంచి అసెస్మెంట్లు, నిర్మాణ రంగ అనుమతులు అంతంత మాత్రమే..కొత్త జోన్లు, సర్కిళ్ల ఏర్పాటు, మూడు కార్పొరేషన్లకు తగ్గట్టుగా గడిచిన కొన్ని రోజులుగా ఉద్యోగులు, వారి పని విభజనకు సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టడంతో పారిశుధ్యం, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలు లేమితో పౌరులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే అధికారులు సైతం కొత్త బాధ్యతలు తీసుకున్నప్పటికీ పాలనపై పూర్తి స్థాయి దృష్టి మాత్రం స్పెషల్ ఆఫీసర్ పాలన వరకు ఎదురుచూపులు తప్పవనే సంకేతాలు ఇస్తున్నారు.