Underage Driving | సిటీబ్యూరో, ఏప్రిల్14(నమస్తే తెలంగాణ): డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన మైనర్ల ముందే వారి పేరెంట్స్‌కు కౌన్సెలింగ్ ఇస్తున్నా రు. డ్రైవింగ్‌కు వాహనాలు ఇవ్వద్దంటూ ఎన్నిసార్లు హెచ్చరించినా పేరెంట్స్ పట్టించుకోవడంలేదు. దీంతో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో మైనర్ ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇటీవల బహదూర్‌పుర నుంచి ఆరాంఘర్ వెళ్లే దారిలో ఒకే వాహనంపై ముగ్గురు మైనర్లు బైక్‌ను రాష్‌గా డ్రైవ్ చేస్తూ వచ్చి డివైడర్ ఢీకొని మృతిచెందారు.
ఈ ఘటన తర్వాత మరికొన్ని ఘటనలు జరిగాయి. ఈ క్రమంలో సిటీ ట్రాఫిక్ పోలీస్ మైనర్ల డ్రైవింగ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మొదటి మూడున్నరనెలల్లోనే సుమారుగా 781 కేసులు నమోదయ్యాయని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. అయితే పట్టుబడిన మైనర్ల పేరెంట్స్‌కు జరిమానా విధించడం, వాహనాల రిజిస్ట్రేషన్‌ను తాత్కాలికంగా రద్దు చేయడం వంటి వాటితోపాటు పిల్లల ముందే కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
మోటారు వాహనాలచట్టం ప్రకారం మైనర్లు బండినడుపుతూ పట్టుబడితే ఆర్సీ రద్దు చేస్తామని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపా రు. ఈ ఏడాది మూడునెలల్లో మైనర్ల డ్రైవింగ్‌తో 7 ప్రమాదాలు జరుగగా, మూడు ఘటనల్లో ముగ్గురు మృతి చెందగా, నాలుగు కేసుల్లో ఆరుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
స్పెషల్ డ్రైవ్‌తో కట్టడికి ప్లాన్..
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మైనర్లు టూవీలర్, ఫోర్‌వీలర్ నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ డ్రైవింగ్‌తో వారే కాకుండా ఇతర వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తెలియనితనం, బైక్విన్యాసాలతో ప్రమాదాలు పెరుగుతున్నాయని గుర్తించిన ట్రాఫిక్ పోలీస్ విభాగం.. ఏప్రిల్ నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఇందులో పలుచోట్ల మైనర్లే పెద్ద వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న స్పెషల్ డ్రైవ్‌తో మైనర్ల డ్రైవింగ్‌కు చెక్ పెట్టే అవకాశం ఉంటుందని, పేరెంట్స్‌కు కౌన్సెలింగ్ ఇవ్వడం, వారిపై కేసులు పెట్టడం ద్వారా కొంత మెరుగవుతుందని జోయల్ డేవిస్ ఆశాభావం వ్యక్తం చేశారు.