సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): బాలికలు, మహిళలను వేధించే పోకిరీలను షీటీమ్స్ వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాచకొండ సీపీ సుధీర్‌బాబు అన్నారు. బస్టాండ్లు, రైల్వే, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లతో పాటు ఇతర బహిరంగ ప్రదేశాల్లో షీ టీమ్స్ డెకాయి ఆపరేషన్లు నిర్వహిస్తుందని, పోకిరీల చేష్టలను సాక్ష్యాలతో సహా గుర్తించి వారిని పట్టుకొని న్యాయస్థానాలలో హాజరుపరుస్తున్నామని సీపీ తెలిపారు.
కాగా షీటీమ్స్‌కు పట్టుబడ్డ వారికి రాచకొండ ఉమెన్ సేఫ్టి వింగ్ ఆధ్వర్యంలో వారి వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో డీసీపీ ఉషా విశ్వనాథ్ నేతృత్వంలోని బృందం కౌన్సిలింగ్ నిర్వహించాయి. గత నెల 1వ తేదీ నుంచి 31 వరకు రాచకొండ షీ టీమ్స్‌కు 249 ఫిర్యాదులు అందాయని డీసీపీ తెలిపారు.
అందులో ఫోన్ల ద్వారా 30, సోషల్‌మీడియా యాప్స్ ద్వారా 87, నేరుగా 132 ఫిర్యాదులు అందగా అందులో 14 క్రిమినల్ కేసులు, 84 పెట్టి కేసులు నమోదు చేసి మిగతా 116 మందికి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు డీసీపీ వివరించారు. మెట్రో రైల్లో డెకాయి ఆపరేషన్‌లో 13 మంది పోకిరీలు పట్టుబడగా వారిని మెట్రో స్టేషన్ల అధికారుల ద్వారా జరిమినాలు విధించామన్నారు. ఈ కౌన్సిలింగ్ సమావేశంలో ఇన్స్పెక్టర్ ముని, అంజయ్యతో పాటు అడ్మిన్ ఎస్సై రాజు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.