సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలోని 15 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఫ్లయింగ్ స్వాడ్, వీడియో సర్వేలెన్స్ బృందాలకు ఎంసీసీ నోడల్ ఆఫీసర్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి శిక్షణ ఇచ్చారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తేదీ నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఎంసీసీలో ఎఫ్ఎస్టీ, వీఎస్టీలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించిన వారిపై తీసుకున్న చర్యలపై రోజు వారీ నివేదిక అందజేయాలని సూచించారు. ఫ్లయింగ్ స్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని, వారిని జీపీఎస్ ట్రాక్ సిస్టం ద్వారా నిరంతరాయంగా పరిశీలిస్తామన్నారు. ఎటువంటి సంఘటనలు జరిగినా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు.
అభ్యర్థుల ఖర్చు 40 లక్షల లోపు ఉండాలి
ఎన్నికల నిర్వహణలో భాగంగా మద్యం, లికర్ తదితర వస్తువులు పట్టుబడ్డ సమయంలో ఫ్లయింగ్ స్వాడ్, సర్వేలెన్స్ వీడియో రికార్డ్ తప్పనిసరిగా చేయాలని ప్రకాశ్‌రెడ్డి సూచించారు. రాజకీయ పార్టీల మీటింగ్స్, బ్యానర్లు మొదలైన సామగ్రిపై వీడియో సర్వేలెన్స్ టీమ్‌లు రికార్డు చేయాలని తెలిపారు. ఫ్లయింగ్ సాడ్ టీమ్‌లు సీజ్ చేసిన నగదును కోర్టుకు సమర్పించాలని, ఎఫ్ఐఆర్ నమోదు కాని నగదును డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ సెల్ (డీజీసీ హైదరాబాద్ కలెక్టరేట్)కు సమర్పించాలని సూచించారు. ఈ సెల్ తగిన ఆధారాలను పరిశీలించి నేరారోపణ లేకపోతే ఆ నగదును సంబంధిత వ్యక్తులకు అందజేస్తుందన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం నగర ప్రజలు 50 వేల లోపు నగదు మాత్రమే అనుమతి ఉన్నదని, 50వేలకు పైబడి ఉన్న నగదుకు సంబంధిత పత్రాలు చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీ నాయకులు ప్రజలను ప్రలోభాలకు గురి చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ వాహనాలను కూడా చెక్ చేసే అధికారం ఉన్నదని చెప్పారు. ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు తమ ఖర్చును 40 లక్షలలోపు ఉండే విధంగా చూసుకోవాలన్నారు.
ఎన్నికల వ్యయాన్ని చూపించకపోతే డిస్మిస్ ; ఎన్నికల వ్యయ మానిటరింగ్ నోడల్ అధికారి శరత్ చంద్ర
అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాన్ని చూపించకపోతే సెక్షన్ 10 ఏ కింద డిస్మిస్ చేసే అవకాశం ఉన్నదని ఎన్నికల వ్యయ మానిటరింగ్ నోడల్ అధికారి శరత్ చంద్ర స్పష్టం చేశారు. రూల్ 88 అనుసరించి పబ్లిక్ కూడా ఎన్నికల ఖర్చును లెకించే అధికారం ఉన్నదని తెలిపారు. అకౌంటింగ్ టీమ్‌లు ప్రత్యేకంగా ఎస్‌వోఆర్ (షాడో ఆఫ్ రిజిస్టర్) ఎఫ్‌సీ (ఎవిడెన్స్) ఎప్పుటికప్పుడు పొందుపరుస్తాయన్నారు. పెయిడ్ న్యూస్‌ను ఎంసీఎంసీ ద్వారా పరిశీలించి అనుకూల, విమర్శాత్మక వార్తలపై ఆర్వో 96 గంటల్లోపు ఎన్నికల అభ్యర్థికి నోటీసు అందిస్తారన్నారు. ఇందుకు 48 గంటల్లోపు అభ్యర్థి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని, ఆ ఖర్చును అభ్యర్థి ఎన్నికల ఖాతాలో నమోదు చేస్తారని శరత్చంద్ర చెప్పారు. సి-విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదులకు వంద నిమిషాల్లోపు సమాధానం ఇవ్వాలన్నారు. ఈ యాప్ ద్వారా ఫిర్యాదు అందిన 15 నిమిషాల్లోపు ఫ్లయింగ్ స్వాడ్ టీమ్ ఆ ప్రదేశానికి చేరుకొని 30 నిమిషాల్లోపు రిపోర్ట్‌ను ఆర్వోకు అందించాలని తెలిపారు. సీ-విజిల్ యాప్‌లో సిటీజన్స్ ఫొటో, వీడియో, ఆడియో ద్వారా తమ ఫిర్యాదులను తెలుపవచ్చని తెలిపారు. సుమోటో ద్వారా ఫ్లయింగ్ స్వాడ్ టీమ్‌లు కూడా ఫిర్యాదులను సీ-విజిల్లో పొందుపర్చవచ్చన్నారు. ఫ్లయింగ్ స్వాడ్ టీమ్‌లు సీ-విజిల్ ఇన్వెస్ట్ గ్రేటర్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకొని సిద్ధంగా ఉండాలన్నారు.