సిటీ బ్యూరో, బడంగ్‌పేట, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ టైన్ ప్లానింగ్ అధికారుల అవినీతి బుద్ధి భూ ఆక్రమణదారులకు వరంలా మరుతున్నది. రూ.కోట్ల విలువైన భూములను కబ్జాకోరులకు కట్టబెడుతూ తీవ్రమైన అవినీతికి పాల్పడుతున్నారు. భూమి ఏదైనా సరే డబ్బులు తీసుకుని నిర్మాణాలకు తక్షణమే అనుమతులిస్తున్నారు. కనీసం సర్వే, తనిఖీ చేయకుండా కాసులకు కక్కుర్తి పడి సంతకాలు చేస్తున్నారు.
ప్రభుత్వ భూములు, నిషేధిత జాబితాలో ఉన్న భూములు, సీలింగ్ భూములు, గ్రీన్ బెల్ట్, పార్కులు, ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లోని భూముల్లో నిర్మాణాలకు అనుమతులిస్తూ ప్రభుత్వ భూములను కబ్జాకోరులకు కట్టబెడుతున్నారు. ఈ అవినీతి బాగోతం బడంగ్‌పేట పురపాలక సంఘం పరిధిలో ఏండ్ల తరబడిగా జోరుగా సాగుతున్నది. ప్రభుత్వ భూముల్లో అనుమతులు తీసుకుని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో గతంలో పనిచేసిన లాలప్ప, మున్సిపల్ కమిషనర్ సరస్వతి ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూముల్లో ఇండ్ల నిర్మాణాలకు అనుమతులిచ్చారు. అక్రమ నిర్మాణాలపై ఎన్ని ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు మాత్రం ఏమీ ఎరుగనట్లు వ్యవహరిస్తున్నారు.
నాదర్గుల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 197కు చెందిన భూమిలో నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని బాలాపూర్ తహసీల్దార్ ఇందిరాదేవి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సర్యూలర్ జారీ చేశారు. కానీ బడంగ్‌పేట మున్సిపల్ కమిషన్ సరస్వతి, టౌన్ ప్లానింగ్ అధికారి లాలప్ప నిబంధనలకు విరుద్ధంగా కొంతమందికి ఇండ్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇచ్చారు. మరికొంత మంది తమకు కూడా అనుమతులివ్వాలని పలుమార్లు ఆందోళనలు చేపట్టారు.
బడంగ్‌పేటలోని సర్వే నంబర్ 79లో పార్కు స్థలం ఉంది. అక్కడ ఎలాంటి అనుమతి ఇవ్వకూడదని గతంలో టీపీఓగా ఉన్న విజయ శ్రీ, కమిషనర్ వసంత సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. వారు బదిలీ అయిన తర్వాత టీపీఓ అశోక్ అదే సర్వే నంబర్లో ఇంటి నిర్మాణానికి అనుమతిచ్చారు. ఫిర్యాదులు రావడంతో రద్దు చేశారు. ఆ తర్వాత వచ్చిన టీపీఓ లాలప్ప మరోసారి అనుమతిచ్చారు.
సదరు వ్యక్తి 79 సర్వేనంబర్ పేరిట అనుమతి తీసుకొని సర్వే నంబర్ 82లో నిర్మాణాలు చేపడుతున్నారని అనేక ఫిర్యాదులు చేశారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. 82 లో ఉన్న భూమికి అసలు ఎలాంటి పత్రాలు లేవు. దొంగ డాక్యూమెంట్లు సృష్టించి రిజిస్టేషన్ చేశారని గతంలో భిక్షపతి రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ భూమి ఎవరిదీ కాదని మారుతీనగర్ కాలనీకి చెందుతుందని కాలనీ వాసులు ఫిర్యాదు చేస్తే స్థానిక నాయకులు వారిని బెదిరించారు. ప్రస్తుతం నిర్మాణాలు జరుగుతున్న స్థలం తనదని సంరెడ్డి శేఖర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో సంరెడ్డి శేఖర్‌రెడ్డి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
ఇటీవల సర్వే నంబర్ 90/4బీ/1లో పాస్ బుక్‌లపై ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని ఫిర్యాదులు ఉన్నాయి. దాదాపుగా 28 అనుమతులు ఇచ్చినట్లు ఏకంగా మున్సిపల్ ప్రత్యేక అధికారికి ఫిర్యాదు చేశారు. 2020కి ముందు రిజిస్ట్రేషన్ అయిన వాటికే అనుమతులు ఇవ్వాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా అనుమతులు ఇస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. ఫైల్ నంబర్ 485479/బీ /ఏడీఏ/ 0799/ 2025లో మరో సర్వే నంబర్లో అధికారులు ఇచ్చిన తప్పుడు అనుమతుల ఫైల్ నంబర్ 472889/బీడీఏ/0264/2025 వందల సంఖ్యలో అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలు వస్తున్నాయి.
అల్మాస్గూడ 24వ డివిజన్లో ఉన్న సర్వే నంబర్లు 122,123,124,129లోని 63 ఎకరాల భూమి గ్రీన్ బెల్ట్ ఓపెన్ ప్లేస్ జోన్‌గా ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. ఈభూముల్లో నిర్మాణాలకు అనుమతులివ్వొదేనే నిబంధనలు ఉన్నాయి. కానీ ఇక్కడ వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. 120 మాస్టర్ ప్లాన్ రోడ్డును సైతం కబ్జా చేశారు. సర్వే నంబర్ 125లో నిర్మాణ అనుమతులు తీసుకొని గ్రీన్ బెల్ట్ సర్వే నంబర్ 24లో బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు.
ఫైల్ నంబర్ 004449/బీపీ/డీటీసీపీ/3037/0009/2023, పర్మిట్ నంబర్ 0015/బీపీ/3037/2023కు పర్మిషన్ ఇచ్చారు. అనుమతులు ఒక చోట నిర్మాణాలు మరో చోట చేస్తున్నారని గతంలో కార్పొరేటర్ ఏనుగు రాంరెడ్డి మున్సిపల్ కార్పొరేషన్లో ఫిర్యాదు చేశారు. ఇవే కాకుండా వార్డు నంబర్ 30లోని సర్వే నంబర్ 148,149కు చెందిన ప్రోహిబిటెడ్ భూముల్లో అనుమతులు ఇచ్చినట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి.
సుల్తాన్ పూర్లో ఆఖరికి చనిపోయిన వ్యక్తి పేరు మీద కూడా ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. ఓ వ్యక్తి 2020లో చనిపోతే 2025 మార్చి 26న తన పేరు మీద ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. తమ భూమిని ఆక్రమించుకున్నారని సుల్తాన్ పూర్‌కు చెందిన యాదిరెడ్డి జిల్లా కలెక్టర్‌కు, సీడీఎంఏకు ఫిర్యాదు చేశారు. ఆరు నెలల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు.
బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌పై నిత్యం వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని ఉన్నత అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తున్నది. ఏడాది నుంచి పొంతిన అనుమతుల జాబితా పై దర్యప్తు మొదలు పెట్టిన్నట్లు తెలుస్తుంది. పాస్ పుస్తకాల మీద ఇచ్చిన అనుమతుల జాబితాపై నివేదిక అందజేయాలని ఆదేశాలు ఉన్నాయి. దీంతో ఎంచేయాలో తెలియక అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. గతంలో పనిచేసిన టౌన్ ప్లానింగ్ అధికారి అశోక్ ఇలాంటి తప్పిదాలతో ఏసీబీకి పట్టుబడ్డారు. ఆతర్వాత వచ్చిన సింగ్, లాలప్ప… అశోక్‌ను మించిపోయినట్లు సమాచారం. వారిచ్చిన అనుమతుల డాక్యుమెంట్స్ ఓపెన్ కాకుండా సాంకేతికి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని బ్లాక్ చేసిన్నట్లు తెలుస్తున్నది.
బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేకుండా పాస్ పుస్తకాలపై అధికార పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ 23 ఇంటి నిర్మాణ అనుమతులను ఇప్పించినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన ఇంటి నిర్మాణ అనుమతులును రద్దు చేయాలని స్థానిక నాయకులు కొందరు ఉన్నత అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది.
కాగా, ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ఉన్నతాధికారులు.. నాదర్‌గూల్ రెవెన్యూ పరిధిలో 2025లో టౌన్ ప్లానింగ్ అధికారులు జారీ చేసిన 23 ఇంటి నిర్మాణ అనుమతులను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అయితే ఆ నిర్మాణాలను రద్దు చేస్తే .. తన వద్ద వెయ్యి ఇల్లీగల్ అనుమతులు ఇచ్చిన జాబితా ఉందని తాజా మాజీ కార్పొరేటర్ అధికారులను బెదిరించడంతో ఏం చేయాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పై అధికారులు చేసిన సిఫారసును కాదన లేక అధికార పార్టీ నాయకుల మాటను తీసివేయలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.