సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులపై వస్తున్న అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి స్పందించారు. వెంటనే అధికారులపై వస్తున్న అవినీతి, ఆరోపణల మీద విచారణ జరిపేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వారం, పది రోజుల్లో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని దర్యాప్తు బృందాన్ని ఆదేశించారు.
విచారణ నివేదిక ఆధారంగా అక్రమాలకు పాల్పడే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఈడీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. అంతే కాకుండా గంజాయి డాన్ నీతూబాయిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. శేరిలింగంపల్లి పరిధిలోని నానక్‌రామ్‌గూడకు చెందిన నీతూబాయిపై ఇప్పటికే ఆబ్కారీ పోలీసులు 25 కేసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు మరో 7కేసులు నమోదు చేశారని, అయినా నిందితురాలి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో రెండు సార్లు పీడీ చట్టం ప్రయోగించి ,రెండు సార్లు జైలుకు పంపించడమే కాకుండా గంజాయి అమ్మకాలతో కూడబెట్టిన రూ.15.17లక్షల స్థిర, చర ఆస్తులను,
ఆమె కుటుంబ సభ్యులైన మధుబాయి నుంచి రూ.25.13లక్షలు, గౌతమ్‌సింగ్ నుంచి రూ.91.21లక్షల అక్రమ ఆస్తులను సైతం జప్తు చేయడం జరిగిందని ఈడీ వివరించారు. ఐటీ కారిడార్ ఉన్న నానక్‌రామ్‌గూడ, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో గంజాయిని పూర్తిగా రూపుమాపేందుకు ధూల్‌పేట తరహాలో స్థానికంగా ప్రత్యేక ఎక్సైజ్ బృందాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ బృందాలు ఇక నుంచి ప్రతి నిత్యం గంజాయి, డ్రగ్స్, నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ వంటి నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతినిత్యం తనిఖీలు నిర్వహిస్తారని ఈడీ వెల్లడించారు.