సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ ప్రజలు సమస్యల చిక్కుముడులు ఒకవైపు.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన బల్దియా మరోవైపు ..ఈ సమయంలో ప్రజల మధ్యలో ఉండి అభివృద్ధి కోసం ఉండాల్సిన కార్పొరేటర్లు ‘స్టడీ టూర్ ’ పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని విలాసాలకు తగలేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుత పాలక మండలి గడువు మరో 33 రోజుల్లో ముగుస్తున్న.. స్టడీ టూర్ అంటూ కార్పొరేటర్లు అహ్మదాబాద్, చండీగఢ్ వంటి నగరాల్లో ‘పాలన’ ఎలా ఉందో చూడడానికి వెళ్లనున్నారు.. టూర్‌కు సంబంధించి ముందే షెడ్యూల్‌ను ఖరారు చేసుకుని మరీ నామమాత్రంగా స్టాండింగ్
కమిటీలో ఈ అంశాన్ని పెట్టి ఆమోద ముద్ర వేయడం ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రూ.1.40 కోట్ల ఖర్చు చేస్తుండడం ఏమి ఆశించి టూర్లకు ప్లాన్ చేశారని విపక్ష పార్టీల నుంచి అభ్యంతరాలు వచ్చిన డోంట్‌కేర్ అంటూ స్టాండింగ్ కమిటీ సమావేశంలో అధ్యయన టూర్‌ను ఆమోదం తెలిపారు. గతంలో కార్పొరేటర్లు ఇండోర్, లక్నో, గౌహతి, షిల్లాంగ్ సిటీల్లో స్టడీ టూర్ పేరుతో పర్యటించారు. ఈ పర్యటనతో ఒరిగిందేమి లేదని, ఇప్పటి వరకు నివేదిక సమర్పించలేదని విమర్శలు వచ్చిన మేయర్ మాత్రం వెనక్కి తగ్గకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన సోమవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరంగానూ సిద్ధం చేసిన రూ.11,460కోట్ల బడ్జెట్‌తో పాటు 15 ఎజెండా అంశాలు, 7 అడిషనల్ అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు.
చందానగర్ నుంచి అమీన్పూర్ వరకు రహదారి విస్తరణలో భాగంగా 124 ఆస్తులను స్వాధీనం చేసుకోనున్నారు. దీంతో పాటు మియాపూర్ క్రాస్‌రోడ్ నుంచి అల్విన్ క్రాస్‌రోడ్ వరకు చేపట్టే రహదారి విస్తరణ పనులకు అవసరమైన 220 ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఆమోదం తెలిపారు. జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ఏఐ ఆధారిత సొల్యూషన్ల అమలు, నిర్వహణ, సంరక్షణకు మేనేజ్డ్ సర్వీస్ ప్రొవైడర్ ఎంపికకు ఈ -ప్రొక్యూర్మెంట్ టెండర్లు ఆహ్వానించేందుకు ఆనుమతి ఇచ్చారు. ఏఐ చాట్‌బాట్, ఆటోమెటెడ్ ఫారమ్, పిల్లింగ్ సొల్యూషన్లు ఉండగా, ఇందుకు మూడేళ్ల ఒప్పందంతో ఏజెన్సీకి పనులు అప్పగించనున్నారు. పలు సీఎస్ఆర్ పనులకు ఆమోద ముద్ర వేశారు. సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.