సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో గడిచిన రెండు రోజులుగా విస్తారంగా వర్షం కురుస్తున్నది. అయితే ఈ సారి వానాకాలం కష్టాల నివారణ బాధ్యతలను భుజానే వేసుకున్న హైడ్రా..ఇప్పటికే 4100 మంది సిబ్బందితో రెండు రకాల మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లను సిద్ధం చేసింది. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైడ్రాకు సంబంధించిన క్షేత్రస్థాయిలోని ఎంఈటీ, ఎస్ఎఫ్వోలతో స్థానిక డివిజన్ కార్పొరేటర్ల మధ్య సమన్వయం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
క్షేత్రస్థాయిలో మాన్సూన్ టీం ఎక్కడ ఉన్నారు? వారిని మేం ఎలా సంప్రదించాలి? వాస్తవ పరిస్థితులు తెలిసిన మాతో హైడ్రా సిబ్బంది లేకపోవడంతో సమస్య తీవ్రరూపం దాల్చుతుందంటూ బుధవారం జీహెచ్ఎంసీ ఇంజినీర్ల వద్ద కొందరు కార్పొరేటర్లు వాపోయారు. ముఖ్యంగా 141 మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్లతో పాటు మరో 150 చోట్ల వరద నీరు నిలిచే ప్రాంతాలు, నాలాలు ఉప్పొంగే ఏరియాల్లో హైడ్రా సహాయక చర్యలు వేగవంతం చేయాలని, స్థానిక కార్పొరేటర్ల భాగస్వామ్యంతో హైడ్రా పనిచేయాలని కార్పొరేటర్లు కోరుతున్నారు.
బాగ్‌అంబర్‌పేట డివిజన్ వైభవ్నగర్కాలనీ గాయత్రి టవర్స్ వద్ద 15 రోజుల నుంచి మ్యాన్‌హోల్ నుంచి మురుగు నీరు పొంగి.. రోడ్డు పైకి వస్తున్నది. మురుగు నీరంతా ఒకచోట చేరి.. చిన్నపాటి మడుగులా తయారవుతున్నది. దీంతో స్థానికులు, ప్రయాణికులు దుర్వాసనతో అవస్థలుపడుతున్నారు. సమస్యను స్థానికులు అటు జీహెచ్ఎంసీ, ఇటు వాటర్‌వర్క్స్ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా..తమది కాదంటే తమది కాదని ఒకరిపై ఒకరు చెబుతున్నారు.
-అంబర్‌పేట, జూలై 2