పటాన్ చెరు, సెప్టెంబర్ 16: రోడ్లపై చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ (Mettu Kumar Yadav) అధికారులకు సూచించారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో అస్తవ్యస్తంగా పారిశుధ్యం అనే శీర్షిక వార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్.. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేష్ కుమార్, శానిటేషన్ సూపర్వైజర్ పవన్, రాంకీ విజయ్‌తో కలసి పర్యటించారు.
డివిజన్ పరిధిలోని మైనార్టీ ఫంక్షన్ హాల్ ఎదురుగా రోడ్డు పక్కన చెత్తను బహిరంగ ప్రదేశంలో పడేయడం వల్ల డంపింగ్ యార్డ్‌లా మారుతుందని, చెత్తను వెంటనే తొలగించాలని ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో కూరగాయలు అమ్ముకొని, మిగిలినవాటిని ఆటోలో తెచ్చి పడేవేస్తుండగా సిబ్బందితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని వారిని మందలించి, మరొకసారి ఇలా చెత్తను రోడ్లపై వేయకూడదని హెచ్చరించారు.
చెత్తను రోడ్లపై పారవేయడం వల్ల దోమలు, ఈగలు పెరిగి విష జ్వరాలు ప్రబలుతాయని అవగాహన కల్పించారు.
అనంతరం శాంతి నగర్ కాలనీలో రెండు ఇండ్ల మధ్యలో గల ఖాళీ స్థలంలో చెత్తను పారవేస్తున్నారని, అలాంటివారిని సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఫోటో తీసి, వారికి జరిమాన విధించాలని ఆదేశించారు. పేరుకున్న చెత్తను సిబ్బందితో తొలగింపజేశారు. అనంతరం బతుకమ్మ ఘాట్‌ను పరిశీలించారు. బతుకమ్మ పండుగ వస్తుండటంతో ఘాట్‌ను సిద్ధం చేయాలని, పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించాలన్నారు.