వెంగళరావునగర్, డిసెంబర్ 8: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కార్పొరేటర్ దే దీప్య విజయ్ సూచించారు. గురువారం యూసుఫ్‌గూడ కృష్ణకాంత్ పార్క్ వద్ద జీహెచ్ఎంసీ ఏఎంహెచ్‌వో బిందుభార్గవితో కలిసి ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరాన్ని అందంగా ఉంచేందుకు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని..రోడ్లపై చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి స్వచ్ఛ ఆటోలో వేయాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దరిచేరవన్నారు. కార్యక్రమంలో బల్దియా శానిటరీ సూపర్వైజర్ విజయ్, రాంకీ సర్కిల్ 19 ఇన్చార్జి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్,డిసెంబర్8: బహిరంగ ప్రదేశాల్లో చెత్త కనిపించకుండా పారిశుధ్య పనులు చేపట్టాలని కార్పొరేటర్ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ కమిటీ సభ్యుడు, కార్పొరేటర్ బండారి రాజ్‌కుమార్ పటేల్ సూచించారు. గురువారం ఏఎంఓహెచ్ డాక్టర్ బిందుభార్గవి అధ్యక్షతన యూసుఫ్‌గూడ పోలీస్ బెటాలియన్ గ్రౌం డ్లో శానిటేషన్, స్వచ్ఛ ఆటోల సిబ్బందితో నిర్వహించిన సమావేశానికి హాజరై పారిశుధ్య పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్న తరుణంలో పారిశుధ్య ప్రమాణాలను పెంచాలని అన్నారు. డంపర్ బిన్లు తొలగించిన నేపథ్యంలో స్వచ్ఛ ఆటోల సిబ్బంది విధిగా ప్రతి ఇంటినుంచి చెత్త సేకరించాల్సిందేనని.. జీవీపీ పాయింట్ల వద్ద కూడా సంబంధిత ఏజెన్సీలు సమయానుకూలంగా చెత్త తొలగించాలని అన్నారు. స్వచ్ఛ ఆటోలకు చెత్త ఇవ్వని వారి ఇంటి నంబర్లు నమోదుచేసి ఇవ్వాలని ఏఎంఓహెచ్ డాక్టర్ బిందుభార్గవి సూచించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్, ఎస్ఎఫ్ఏలు, సిబ్బంది పాల్గొన్నారు.