సిటీబ్యూరో, జూలై 24: గంజాయి ప్యాకెట్లు పెట్టాలా.. డ్రగ్స్ పెట్టి పట్టించాలా.. ఏం రా బలిసిందా నీకు.. ఫోన్లు చేస్తే వస్తలేవు. పార్టీ మీటింగ్స్‌కు రమ్మంటే రావా.. ఏం తమాషాలు చేస్తున్నావా.. రారా వచ్చి కలువకుంటే నీ సంగతి చూస్తానంటూ కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ బెదిరింపు ధోరణితో దివంగత బోరబండ డివిజన్ మైనార్టీ నాయకుడు సర్దార్తో మాట్లాడిన ఫోన్‌కాల్ సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. నేను వేరే పనులు చేసుకుంటున్నా..
పంజగుట్టలో ఉన్నానంటూ సర్దార్ వణికిపోతూ బాబాకు చెప్పిన ఆడియోను నర్సింహా అనే వ్యక్తి ఫేస్బుక్లో పోస్టు చేయడంతో ఇప్పుడు సోషల్ మీడియోలో చక్కర్లు కొడ్తోంది. బీఆర్ఎస్ బోరబండ డివిజన్ మైనార్టీ విభాగం నాయకుడు సర్దార్‌ను అక్రమంగా కేసుల్లో ఇరికిస్తానంటూ ఫోన్‌చేసి బాబా ఫసియుద్దీన్ బెదిరింపులకు దిగాడనడానికి సోషల్ మీడియోలో వైరల్ అవుతున్న ఈ ఆడియోనే బలమైన ఆధారం. ఇన్ని సాక్ష్యాధారాలున్నా బాబాపై పోలీసులు చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేయడం విమర్శలకు తావిస్తోంది.
బాబా వేధింపులతోనే సర్దార్ బలవన్మరణం..!
అక్రమాలు, దౌర్జన్యాలతో రాజకీయాలు చేసే బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ బెదిరింపులతోనే బీఆర్ఎస్ నాయకుడు సర్దార్ తన ఇంటి పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి కుటుంబీకులు చెప్తున్నారు. కాంగ్రెస్‌లో చేరడానికి నిరాకరించిన సర్దార్‌పై బాబా కక్ష గట్టాడని.. బోరబండలో సర్దార్ ఇల్లు కట్టే సమయంలో కార్పొరేటర్ బాబా, అతని భార్య హబీబా సుల్తానా, పీఏ సప్తగిరి తమ ఇంటికొచ్చి బెదిరించారని వారు కన్నీటిపర్యంతమయ్యారు. డబ్బు ఇవ్వకుంటే ఇల్లు కూల్చేయిస్తామంటూ బాబా పీఏ సప్తగిరి బెదిరింపులకు గురిచేసి బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసి ఇల్లు కూల్చేయించాడని సర్దార్ తల్లి వాపోయారు.
కాంగ్రెస్‌లో చేరాలని ఒత్తిడి తెచ్చేవారు..
కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందేనని బాబా ఒత్తిడి తెచ్చాడని.. అయితే సర్దార్ ఎంతకీ కాంగ్రెస్‌లోకి వెళ్లకుండా బీఆర్ఎస్లోనే కొనసాగడంతో బాబా కక్షగట్టాడని మృతుడి కుటుంబీకులు తెలిపారు. బాబా ఎన్ని బెదిరింపులకు గురిచేసినా.. ఇంట్లోవారికి చెప్తే భయపడ్తారని.. తనలోనే ఆ భాధను దిగమింగి.. బాబా పెట్టే వేధింపులు తాళలేక సర్దార్ బలవన్మరణానకి పాల్పడ్డాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.
బాబాకు డ్రగ్స్ పెడ్లర్లతో లింకులా…?
కాంగ్రెస్ లోకి ఫిరాయించిన బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్‌కు డ్రగ్స్ పెడ్లర్లతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా… గంజాయి ప్యాకెట్లు పెట్టి పోలీసులకు పట్టించమంటావా అని బెదిరిస్తున్నాడంటే.. అతనికి గంజాయి మఠాలతో సంబంధాలు ఉన్నాయా అనే సందేహాలు తలెత్తున్నాయి. పెద్ద స్థాయిలో ఉన్న నాయకుడిగా చెప్పుకునే బాబాకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి. వైట్ పౌడర్ డ్రగ్ పెట్టి పట్టించాలా అని బాబా బెదిరిస్తున్న తీరు ఆడియో వింటుంటే.. బ్రౌన్ షుగర్, కొకైన్ వంటి వైట్ పౌడర్ డ్రగ్ రాకెట్‌తో బాబాకు సంబంధాలు ఉన్నాయా.. ఈ విషయమై నార్కోటిక్ విభాగం అధికారులు విచారణ జరిపితే మరిన్ని ఆధారాలు వెలుగుచూసే అవకాశం ఉంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.