గురువారం 04 జూన్ 2020
Hyderabad - Apr 02, 2020 , 06:46:10

సైబరాబాద్‌ కంట్రోల్‌ రూం.. సేవలకు విశేష స్పందన

సైబరాబాద్‌ కంట్రోల్‌ రూం.. సేవలకు విశేష స్పందన

  • వారం రోజుల్లోనే 12వేల ఫోన్‌కాల్స్‌
  • రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 33 చెక్‌పోస్టులు  
  • రాకపోకలపై నిరంతరం నిఘా..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొవిడ్‌-19 పోలీసుల కంట్రోల్‌ రూమ్‌ సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. ఏర్పాటు చేసిన వారం రోజుల్లోనే కంట్రోల్‌ రూమ్‌ 9490617440, 9490617431లకు దాదాపు 12 వేల ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. ప్రజలు ఈ నంబర్లకు ఫోన్‌చేసి సేవలు పొందుతున్నారు. దీనికి తోడు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌.. పలు సంస్థల సహకారంతో దాదాపు 13 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 105 పైగా బాధితులకు అత్యవసర వైద్య సేవలను అందించారు. అలాగే 656 మంది డయాలిసిస్‌ రోగులు దవాఖానలకు వెళ్లడానికి పాసులు అందించారు. అలాగే కిమో థెరపీ పరీక్షలు, గర్భిణులు, గుండెపోటుకు గురైనవారు సకాలంలో పోలీసుల సేవలు పొంది ప్రాణాలను కాపాడుకున్నారు. ఇక్కడ ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, 9 మంది కానిస్టేబుళ్లు 24/7 కింద పని చేస్తున్నారు. వీరికి ప్రతి పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఒక ఎస్‌ఐ నోడల్‌ అధికారిగా అనుసంధానమై ఉన్నారు. కంట్రోల్‌ రూమ్‌ విధులను సైబరాబాద్‌ అదనపు డీసీపీ ప్రవీణ కుమార్‌రెడ్డి పరిశీలిస్తుండగా, ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ పర్యవేక్షిస్తున్నారు.  

పేదలు, వలస కార్మికులకు భరోసా

రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పేదలకు, వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలను భాగస్వాములను చేస్తూ సీపీ మహేశ్‌ భగవత్‌ చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రతి రోజు వేలాది మందికి నిత్యావసర సరకులను అందిస్తూ.. వారి ఆకలిని తీర్చుతున్నారు. అలాగే వారికి కరోనా నుంచి ఎలా బయటపడాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. దాదాపు 33 చెక్‌పోస్టుల ద్వారా నిత్యం రాకపోకలపై నిఘా పెడుతున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై మొత్తం 359 కేసులు నమోదు చేశారు. ఇందులో 40 లాక్‌డౌన్‌ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయగా.. 279 ద్విచక్రవాహనాలు, 28 కార్లు, 11 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2340 మందిని కరోనా అనుమానితులుగా గుర్తించి  అందులో 2105 మందిని విచారించారు. 1988 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. విదేశాల నుంచి వచ్చిన సమాచారాన్ని దాచిపెట్టి తిరుగుతున్న 1158 మంది పాసుపోర్టులను స్వాధీనం చేసుకుని జిల్లా కలెక్టర్‌కు అప్పగించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. 


logo