e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home హైదరాబాద్‌ నిబ్బరంగా.. నిర్భయంగా

నిబ్బరంగా.. నిర్భయంగా

నిబ్బరంగా.. నిర్భయంగా
  • కరోనా వేళ మారిన పరిస్థితులు
  • ఉద్యోగాలు పోయి కొందరు..
  • వ్యాపారం నడవక ఇంకొందరు
  • కదలని చక్రాలు.. ఎన్నెన్నో వెతలు
  • మనోధైర్యంతో ప్రత్యామ్నాయ ఉపాధి
  • కరోనా తగ్గేవరకు తప్పదని నిబ్బరం

మాయదారి మమమ్మారి అన్నిరంగాలను కుదిపేసింది. ఉద్యోగాలు కోల్పోయి కొందరు..వ్యాపారం లేక మరికొందరు ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నారు. ఏండ్ల తరబడి జీవనాధారమైన వృత్తులు ఆగమయ్యాయి. నాలుగుచక్రాలు నడిస్తేనే ఐదు వేళ్లు నోట్లోకి పోయే పరిస్థితి మారిపోయింది. అయినా అదరకుండా, మనోధైర్యం కోల్పోకుండా ప్రత్యామ్నాయ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుం టున్నారు. ఏ మాత్రం నామోషీ లేకుండా కష్టపడి పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఉపాయం ఉంటే ఏదైనా అనితర సాధ్యమని నిరూపి స్తున్నారు. ఉపాధి లేక మానసికంగా కుంగిపోతున్న వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా తగ్గాక పరిస్థితులు కుదుటపడితే యథా స్థితి వస్తుందని మనోనిబ్బరంతో బతుకుబండి లాగిస్తున్నారు. ఆయా రంగాల్లో ఉపాధి కోల్పోయి ప్రత్యామ్నాయంగా పనులు చేసుకుంటున్న వారిపై ప్రత్యేక కథనం..

కారులో పుచ్చకాయలు, పండ్లు

రామంతాపూర్‌కు చెందిన కనకరాజు క్యాబ్‌ డ్రైవర్‌. ఐటీ రంగంపై ఆధారపడి కారు నడిపేవాడు. గతేడాదిగా క్యాబ్‌లు నడవకపోవడంతో నమ్ముకున్న వాహవాన్నే బతుకు బండిగా మలిచాడు. పుచ్చకాయలు, ఇతర పండ్లు విక్రయిస్తూ రోజుకు వెయ్యి రూపాయల వరకు ఆదాయం పొందుతున్నాడు. మరో క్యాబ్‌ మహిళా డ్రైవర్‌ లక్ష్మీ కూడా తన క్యాబ్‌ను వెనకాల సీట్లు తొలగించి పలు చౌరస్తాల్లో కూరగాయలు, ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు అమ్ముతూ జీవితాన్ని నెట్టుకొస్తుంది.

ఐటీ ఉద్యోగులు వస్తేనే ఉపాధి

కరోనా, లాక్‌డౌన్‌తో క్యాబ్‌లు నడిచే పరిస్థితి లేదు. గిరాకీలు లేవు. నా వాహనం వెనుక భాగంలో కొన్ని మార్పులు చేసి పండ్లు విక్రయిస్తున్నా. నగరంలోని పలు ప్రాంతాలకు వెళ్లి పుచ్చకాయలు అమ్ముతున్నాం.10 ఏండ్ల నుంచి క్యాబ్‌ వృత్తిలో ఉన్నాను. ఐటీ ఉద్యోగులంతా మళ్లీ కార్యాలయాలకు వస్తే పూర్వపరిస్థితులు వస్తాయి. – వెంకట్రామ్‌ రాజ్‌, క్యాబ్‌ డ్రైవర్‌.

నాడు ప్లాస్టిక్‌ కవర్లు.. నేడు కూరగాయలు

మణికొండ : కాటేదాన్‌ దుర్గానగర్‌కు చెందిన గోపాల్‌ స్థానిక పారిశ్రామికవాడలో 10 ఏండ్లుగా ప్లాస్టిక్‌ కవర్ల కంపెనీలో పనిచేస్తున్నాడు. కరోనా సమయంలో గిరాకీ లేకపోవడంతో యాజమాన్యం పీస్‌ వర్క్‌ చేయడానికి కవర్లు ఇవ్వడం తగ్గించింది. దీంతో ఇల్లు గడవడం భారంగా మారింది. ఖర్చులు మీదపడుతుండడంతో ప్రత్యామ్నాయంగా ఇంటి ముందు కూరగాయలు విక్రయిస్తూ రోజుకు రూ.500 వరకు సంపాదిస్తున్నాడు. టైం ఉన్నప్పుడు విస్తరాకులు అమ్ముకుంటున్నాడు.

థియేటర్లు లేక పూల అమ్మకాలు

ముషీరాబాద్‌/చిక్కడపల్లి : కరోనాతో దాదాపు ఏడాదికాలంగా సినిమా థియేటర్లు మూతబడ్డాయి. మధ్యలో సడలించినా ఎక్కువకాలం సినిమాలు నడవలేదు. నారాయణగూడ శాంతి థియేటర్‌లో 30 ఏండ్లుగా అసిస్టెంట్‌ ఆపరేటర్‌గా పనిచేసిన ప్రసాద్‌ గత లాక్‌డౌన్‌ నుంచి ఇంటికే పరిమితమయ్యాడు. ధైర్యం కోల్పోకుండా బాగ్‌లింగంపల్లిలో పూల వ్యాపారం మొదలుపెట్టాడు. చేసేది చిన్న వ్యాపారమైన కొంతలో కొంత బెటరే అంటున్నాడు.

దినసరి కూలీగా అటెండర్‌

బుజ్జిది గుజరాత్‌ రాష్ట్రం. పిల్లలతో కలిసి రంగారెడ్డి జిల్లా కందుకూరుకు వలసవచ్చి ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో అటెండర్‌గా చేరింది. ఏడాది నుంచి స్కూళ్లు సరిగ్గా నడవకపోవడంతో కుటంబపోషణకు సమీపంలోని ప్రైవేట్‌ కంపెనీలో దినసరి కూలీగా పనిచేస్తున్నది. రెండునెలల నుంచి ప్రభుత్వమిస్తున్న ఆర్థిక సాయం ఊరట ఇస్తున్నదని అంటున్నది.

మినరల్‌ వాటర్‌ సరఫరా

కేపీహెచ్‌బీ కాలనీ : కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన హబీబుల్లా బీటెక్‌ పూర్తిచేసి హైటెక్‌సిటీలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో రెండేళ్లపాటు ఉద్యోగం చేశాడు. గతేడాది లాక్‌డౌన్‌లో ఉద్యోగం పోయింది. ఇతర ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకని కూరగాయల దుకాణం పెట్టాడు. సరిగ్గా నడవకపోవడంతో ఆటోను కొనుగోలు చేసి ఇంటింటికి మినరల్‌ వాటర్‌ సప్లయ్‌ చేస్తున్నాడు. ఉద్యోగం లేదని కుంగిపోకుండా నచ్చిన పనిచేసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు.

బాధను దిగమింగుతూ టైలరింగ్‌

జూబ్లీహిల్స్‌ : తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతానికి చెందిన దొడ్డి రాజు పదేండ్ల క్రితం నగరానికి వచ్చి స్థిరపడ్డాడు. యూసుఫ్‌గూడ మధురానగర్‌లో ఉంటూ సినీరంగంలో ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేసేవాడు. 2015లో అదే ప్రాంతానికి చెందిన భవానీని పెండ్లి చేసుకున్నాడు. నాలుగేండ్ల పాపతో ఆనందంగా గడుపుతున్న ఆ కుటుంబాన్ని కరోనా కాటేసింది. ఏప్రిల్‌ 1న రాజుకు పాజిటివ్‌ రాగా, దవాఖానలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఆదాయ మార్గం మూసుకపోవడంతో భవానీ ప్రస్తుతం తనకు వచ్చిన టైలరింగ్‌ పనిచేసుకుంటూ పాపను కంటికిరెప్పలా చూసుకుంటున్నది.

బ్యాడ్‌ టైం.. బ్యాండ్‌ ఆగింది..

మౌలాలికి చెందిన సాయికుమార్‌ పెండ్లిండ్లు, ఇతర శుభకార్యాలకు బ్యాండ్‌ వాయించేవాడు. గతేడాది నుంచి కరోనాతో ఉన్న ఉపాధి పోయింది. శుభకార్యాలు లేకపోవడంతో ఎవరూ బ్యాండ్‌ కొట్టేందుకు పిలవడం లేదు. కుటుంబపోషణ భారంగా మారడంతో అధైర్యపడకుండా తోపుడు బండిపై గల్లీగల్లీ తిరుగుతూ అరటిపండ్లు విక్రయిస్తున్నాడు.

ఏదోకటి చేయక తప్పదు

కాకతీయనగర్‌కు చెందిన యాదగిరి గతంలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. కరోనాతో ఉద్యోగం పోయింది. ఇంటి అద్దె, కుటుంబసభ్యుల పోషణ భారంగా మారింది. ఖాళీగా ఉండే బదులు ఏదో ఒకటి చేయాలని భావించాడు. ఇప్పుడున్న పరిస్థితిలో కూరగాయల వ్యాపారమే మేలని భావించి సమీపంలోని చౌరస్తాలో అమ్మకాలు చేస్తున్నాడు. కుటుంబసభ్యుల సహకారం ఉండడంతో వ్యాపారం బాగా సాగుతోంది.

చాయ్‌ హోటల్‌ నడవడం లేదు..

మౌలాలి గాంధీనగర్‌కు చెందిన చందు మొన్నటివరకు ఓ చాయ్‌ హోటల్‌లో పనిచేసేవాడు. నిత్యం రూ.300 నుంచి రూ.400 వరకు సంపాదించేవాడు. లాక్‌డౌన్‌తో హోటల్‌ నడవకపోవడంతో సంపాదన పోయింది. కుటుంబపోషణ కోసం కూరగాయలు విక్రయిస్తున్నాడు. చేసేది భారమే అయినా బాధ్యత తప్పదని అంటున్నాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నిబ్బరంగా.. నిర్భయంగా

ట్రెండింగ్‌

Advertisement