ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ (టీజీడీడీసీఎఫ్) విజయ బ్రాండ్ కాపీ చేసి వాడడం నేరమని ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి చెప్పారు. విక్రేతలు, వినియోగదారులు గమనించాలని సూచించారు. లాలాపేటలోని విజయ డెయిరీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డెయిరీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీ చట్టం 1964 ప్రకారం ఫెడరేషన్ ప్రారంభమైందని చెప్పారు.
2014 ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం విభజన జరిగినప్పటి నుంచి రెండు రాష్ర్టాల్లో వేర్వేరుగా ఫెడరేషన్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. విజయ బ్రాండ్ ఇప్పటికీ ఉమ్మడి హక్కుగానే ఉందని, మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ప్రకారం స్వయం ప్రతిపత్తితో పనిచేస్తున్న జిల్లాల పాల యూనియన్లు బ్రాండ్‌ను వినియోగించుకోవడానికి వీల్లేదన్నారు. ఏ జిల్లా యూనియన్లకు సైతం అనుమతిలేదని ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ అధికారులు రాతపూర్వకంగా స్పష్టం చేశారన్నారు. కానీ కొన్ని జిల్లా యూనియన్లు చట్ట విరుద్ధంగా బ్రాండ్‌ను వినియోగించుకుంటున్నాయని ఆరోపించారు.
సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాం..
ఈ విషయమై సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించగా ఏ ఉత్పత్తులను తయారు చేయడం, విక్రయించడం చేయకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఇప్పటివరకు కర్నూలు జిల్లా పరస్పర సహాయ సహకార సంఘం, వీఎన్ఆర్ డెయిరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, కృష్ణా జిల్లా పాల ఉత్పత్తి పరస్పర సహకార సంఘం, శ్రీసాయి దుర్గ ఎంటర్పైజ్రెస్, నెల్లూరు జిల్లా పరస్పర సహకార పాల ఉత్పత్తి యూనియన్ లిమిటెడ్, ఆల్ రిచ్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్ఎస్ఆర్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్, విజయ మిల్క్ ప్రొడక్ట్స్, నార్మల్ మదర్ డెయిరీ సంస్థలు విజయ బ్రాండ్‌ను అక్రమంగా వాడుకుంటున్నాయని తమ దృష్టికి వచ్చిందని వివరించారు.
వినియోగించే వారు చట్ట ప్రకారం శిక్షార్హులవుతారని చెప్పారు. విజయ బ్రాండ్‌ను వినియోగించుకుంటున్న ఇతర సంస్థల వల్ల ప్రజలు తమపై పెంచుకున్న విశ్వాసానికి విఘాతం కలిగే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రైవేటు డెయిరీలు నాణ్యత పాటించకుండా పాలు, ఇతర పాల ఉత్పత్తులను రూపొందించే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ ప్రజలు జాగ్రత్తతో విజయ తెలంగాణ బ్రాండ్‌ను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని వినియోగదారులు, విక్రేతలు, పంపిణీ దారులు విజయ తెలంగాణ పాలు, ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల పాడి రైతులకు మద్దతు ఇవ్వడమే కాకుండా రాష్ట్ర డెయిరీ రంగ అభివృద్ధికి తోడ్పడుతూ, ప్రజలకు ఆరోగ్యకరమైన, నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులను అందించినవారిగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఎలాంటి సందేహాలు, ఫిర్యాదులు ఉన్నా 91211 60569 నంబర్లో సంప్రదించాలని సూచించారు.