సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : ఇన్సూరెన్స్ కంపెనీలు.. ఆర్టీఏ అధికారుల మధ్య సమన్వయ లోపంతో నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు పుట్టుకొస్తున్నాయి. బీమా కంపెనీల నిర్లక్ష్యం కారణంగా రవాణా అధికారులకు పనిభారం పెరుగుతున్నది. నకిలీ బీమా పత్రాలతో దళారీలు వాహనదారుల వద్ద డబ్బులు దండుకుని పనులు చేసిపెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఏండ్లుగా సాగుతున్న ఇన్సూరెన్స్ పత్రాల దళారీ దందాపై అధికారులు పరిష్కారాలను గతంలోనే గుర్తించారు.
అందుకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేశారు. కానీ అది కార్యరూపం దాల్చడం లేదు. ఇన్సూరెన్స్ కంపెనీలు తమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు రవాణా అధికారులతో సమన్వయం చేసుకుంటే వంద శాతం మోసాలను అరికట్టే వీలుంది. ఆర్టీఏ వెబ్‌సైట్‌తో ఇన్సూరెన్స్ వివరాలు అనుసంధానం చేస్తే ఆయా ఆర్టీఏ కార్యాలయాల్లో వాహనాలు పరీక్షకు వచ్చినప్పుడు సంబంధిత నెంబర్ ఎంటర్ చేయగానే ఇన్సూరెన్స్ నకిలిదా? నిజమైనదా? అనేది తేలిపోతుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు తమ క్లైంట్ల వివరాలు నేరుగా రవాణ వెబ్‌సైట్‌కు లింక్ చేయగలిగితే దళారుల మోసాలు ఉండవు.
అలా చేస్తే ఇన్సూరెన్స్ అప్రూవల్ కాగానే ట్రాన్స్పోర్ట్ వెబ్సైట్లో అప్డేట్ అవుతుంది. ఈ విషయాలను ఆర్టీఏ అధికారులు బీమా కంపెనీల దృష్టికి తీసుకెళ్లినా వారి నుంచి స్పందన రావడం లేదు. దీంతో అధికారుల ఏమీ చేయలేకపోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా వాహనదారులు తక్కువ డబ్బులతో ఇన్సూరెన్స్ వస్తుందని అనుకుని జేబులు గుల్లా చేసుకోవడంతో పాటు బీమా పొందక నష్టపోతున్నారు. ఇప్పటికైనా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవపల్‌మెంట్ అథారిటీ( ఐఆర్డీఏ), రవాణా శాఖ సమన్వయంతో పనిచేస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని రవాణా నిపుణులు చెబుతున్నారు.
అత్యాధునిక సాంకేతిక పరిజానంతో సైబర్‌నేరస్తులు బీమా కంపెనీలకు తెలియకుండానే వాటి పేర్ల మీద లక్షల రూపాయల దందా నిర్వహిస్తున్నారు. క్యూఆర్ కోడ్, కంపెనీ లోగో వివరాలు అన్నీ పొందుపరిచి ఆర్టీఏ అధికారులను మాయ చేస్తున్నారు. ఆయా వాహనాల యజమానుల పేరుతో బీమా పత్రాలు జారీ చేస్తూ దానిపై క్యూఆర్ కోడ్, చెల్లుబాటు అయ్యే తేదీలను ముద్రిస్తున్నారు.
ఇలా ఒక్కో వాహనానికి వేలలో గుంజుతున్నారు. వాస్తవంగా బీమా కోసం ఒక్కొక్క వాహనదారుడు రూ.1500 నుంచి 5 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీని కాలపరిమితి ఏడాది. సాధరణంగా కొత్త వాహనమైనా.. పాత వాహనానికైనా కచ్చితంగా బీమా పత్రం ఉండాల్సిందే. లేదంటే మోటారు వాహన చట్టం ప్రకారం రవాణా శాఖ అధికారులు ఆయా వాహనాల రిజిస్టేష్రన్ గానీ సామార్థ్యపు పరీక్షలు(ఫిట్నెస్) గానీ చేయడానికి వీలు లేదు. అయితే ఇక్కడే దళారులు, ఏజెంట్లు తమ దుర్భుద్ధిని చూపిస్తున్నారు. వాహనదారుడు తన వాహనానికి ఫిట్నెస్ పరీక్ష చేసుకోవడానికి ముందర ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
సంబంధిత సర్టిఫికెట్లను జత చేయాలి. అవి అప్లోడ్ చేశాక నిర్ణయించిన తేదీన వచ్చి వాహన పరీక్ష చేయించుకోవాలి. ఆ క్రమంలో అతడు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లకు ఒరిజినల్ పత్రాలు చూపించాలి. ఫేక్ గాళ్లు తయారు చేసిన పత్రాలు అచ్చం ఒరిజినల్ మాదిరిగానే ఉండటంతో అధికారులు ఫిట్నెస్ పత్రాలు జారీ చేస్తున్నారు. కానీ అవి నిజమైనవా? కావా? అనేది తేల్చే వ్యవస్థ లేకపోవడంతో సమస్య జఠిలమవుతోంది. ఫలితంగా వాహనాలు ఆర్టీఏ, ఇన్సూరెన్స్ కంపెనీల కండ్లు కప్పి యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నాయి.
గేటర్పరిధిలో 11 ఆర్టీఏ కార్యాలయాలున్నాయి. అవి హైదరాబాద్ జిల్లాలో ఖైరతాబాద్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, మలక్‌పేట, చాంద్రాయణగుట్టా, బండ్లగూడ, నగరశివారులోని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఉప్పల్, కొండాపూర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్(పేట్ బషీర్‌బాగ్)లు. రవాణా విభాగంలోని ఆటోరిక్షాలు, ట్రాలీలు, లారీలు, ఇతర సరుకు రవాణా వాహనాలకు ప్రతియేటా ఫిట్నెస్ పరీక్షలు తప్పనిసరి. ప్రతి రోజు కార్యాలయాలకు 200 నుంచి 500 వాహనాలు ఫిట్నెస్ పరీక్షలకు వస్తుంటాయి.
ఈ సమయంలో వాహనం ఆర్సీతోపాటు చెల్లుబాటు అయ్యే బీమా పత్రం, కాలుష్య నియంత్రణ పత్రాలను అధికారులు పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. తక్కువ ధరకే బీమా పొందొచ్చని కొంతమంది వాహనదారులు అత్యాశక వెళ్లి మోసపోతున్నారు. అయితే ప్రమాదం సంభవించినప్పుడు అసలు విషయం తెలిసి వాహనదారులు లబోదిబోమనాల్సిన పరిస్థితి వస్తోంది.
వాహన యజమానులు కూడా తమ వాహనానికి సరైన ఇన్సూరెన్స్ చేయించుకోవాలనే తపన ఉండాలి. అథరైజ్డ్ వాళ్ల దగ్గరనే బీమా పత్రాలు చేయించుకోవాలి. అయితే నేరుగా ఇన్సూరెన్స్ కార్యాలయాల్లోనే సేవలు పొందాలి. ఆన్లైన్లో కూడా కచ్చితమైన వెబ్సైట్లను శోధించి బీమా దరఖాస్తు చేసుకోవాలి. ప్రముఖ కంపెనీల పేరు మీద కూడా నకిలీ వెబ్సైట్లు ఉంటాయి.
అప్రమత్తంగా ఉండాలి. ఇన్సూరెన్స్‌కు ఇచ్చే ప్రీమియం కూడా డబ్బు కాకుండా ఆ కంపెనీ పేరు మీద చెక్ ఇస్తే మంచిది. వాహనదారులు ఏదైన జరగరాని ప్రమాదం సంభవించినప్పుడు బీమా వర్తించకపోవడంతో తప్పు చేశామని గ్రహిస్తున్నారు. మీ దగ్గరకు వచ్చి ఇన్సూరెన్స్ తక్కువ ధరకే చేయిస్తామని చెబితే అది మోసం అని గ్రహించాలి. సరైన ఇన్సూరెన్స్ పొందాలనే ఆలోచన వాహనదారుడికి ఉండాలి. బీమా వాహనదారుడికి రక్షగా బావించాలి. నిర్లక్ష్యం పనికిరాదు.