సిటీబ్యూరో, అక్టోబరు 1 (నమస్తే తెలంగాణ ) : హైడ్రా, జీహెచ్ఎంసీ శాఖల మధ్య సమన్వయ లోపం మరోసారి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. మాన్సూన్ ఎమర్జెన్సీ పనులను జీహెచ్ఎంసీ నుంచి హైడ్రాకు ప్రభుత్వం అప్పగించడం, ఈ నేపథ్యంలో ఇటీవల కురిసిన వర్షాలకు ఇరు శాఖల మధ్య సయోద్య లేమితో వరద కష్టాలు అన్నీ ఇన్నీ కావు..ఈ నేపథ్యంలోనే తాజాగా మరో పంచాయతీ ఇరు శాఖల్లో నెలకొంది.వరద నీటి నిర్వహణ, డ్రైన్లలో వ్యర్థాల తొలగింపునకు వర్షాకాల అత్యవసర బృందాల (ఎంఈటీ)ను ఏర్పాటు చేసిన హైడ్రాకు జీహెచ్ఎంసీ నిధులు కేటాయించాల్సి ఉంది. ఈ మేరకు డివిజన్లకు ఒకటి చొప్పున 150 వర్షాకాల అత్యవసర బృందాలను ఏర్పాటు చేసిన హైడ్రా ఎంపికైన ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించి పనులు చేపట్టింది.
ఈ నేపథ్యంలోనే ఆయా ఏజెన్సీలకు బిల్లులు చెల్లించాల్సి ఉన్న దృష్ట్యా నిధులు కేటాయించాలని కోరుతూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇటీవల జీహెచ్ఎంసీకి లేఖ రాశారు. ఈ క్రమంలో హైడ్రాకు రూ.20 కోట్లు కేటాయించే ప్రతిపాదనలకు అధికారులు స్టాండింగ్ కమిటీ ముందుంచారు. ఇందుకు స్టాండింగ్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ ప్రతిపాదనను ఆమోద ముద్ర వేయకపోవడంతో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇప్పటికే హైడ్రా తీరుపై కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహంతో ఉండడం, స్టాండింగ్ కమిటీ సభ్యులు సైతం నిధుల విడుదల ససేమిరా అనడంతో మున్ముందు ఎటువైపు పరిస్థితులు దారి తీస్తాయోనన్న సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
హైడ్రాలో డీఆర్ఎఫ్, ఎన్ఫోర్స్మెంట్ తదితర విభాగాల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిన సిబ్బంది పనిచేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం అన్ని శాఖల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గరిష్ఠ వేతనం రూ.19,500గా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రాలో కొందరు సిబ్బందికి రూ.24వేల వేతనం చెల్లిస్తున్నారు. సర్కారు జీవోతో హైడ్రా ఖాతా నుంచి రూ.19,500 చెల్లించే పరిస్థితి నెలకొంది. దీనిపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేయడంతో సంస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
ఒక్కొక్కరికీ మిగతా రూ.5వేలు జీహెచ్ఎంసీ నుంచి మ్యాచింగ్ గ్రాంట్‌గా తీసుకునేందుకు అనుమతి నిచ్చింది. బకాయి ఉన్న సిబ్బంది వేతనాలు చెల్లిస్తామని హైడ్రా అధికారులు చెబుతున్నారు. మ్యాచింగ్ గ్రాంట్ విడుదలకు జీహెచ్ఎంసీ స్పదించింది. నెలకు రూ.35.11 లక్షల చొప్పున ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలకు సంబంధించిన రూ.1.05 కోట్లు చెల్లించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. స్టాండింగ్ కమిటీలో ఈ ప్రతిపాదనను చర్చించి దీనికి సైతం ఆమోదం తెలపకపోవడం హైడ్రా అంశం జీహెచ్ఎంసీలో హాట్ టాఫిక్‌గా మారింది.