బడంగ్పేట్, జూన్ 24: బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా లేదని కాంట్రాక్టర్లు ధర్నాకు దిగారు. టెండర్లు రద్దు చేయడంపై కాంట్రాక్టర్లు అసహనం వ్యక్తం చేశారు. గతంలో తీర్మానాలు చేసిన 200 పనులకు టెండర్ ప్రక్రియ ఇప్పటికీ పూర్తి చేయలేదని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఆన్లైన్ టెండర్లలోను గోల్ మాల్ చేస్తున్నారని కాంట్రాక్టర్లు పట్నం శ్రీశైలం, విజయ్ కుమార్, సాయి కిరణ్, శ్రీనివాస్ తదితరులు ఆరోపించారు. ప్రతిసారి అడ్వాన్స్ వర్కులు పెట్టడంపైన వారు తప్పు పట్టారు. అధికారులకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకు నామినేట్ పనులు ఇస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు చెప్పిన వారికే కాంట్రాక్టులు వస్తున్నాయని ఆరోపించారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్, డీఈకి తెలియకుండా టెండర్లు తీయడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఔట్సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్లే అర్ధరాత్రి టెండర్లు తీస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. టెండర్లు అన్ని ఈ ఈ సమక్షంలో తీయవలసి ఉంటుందని తెలిపారు.
ఒకరిపై ఒకరు ఆరోపణలు..
మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్టర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. అత్యవసర విషయంలో అడ్వాన్సుగా పనులు చేసిన వాటిని తెలుసుకొని టెండర్ వేసి కమీషన్లు తీసుకుంటున్నారని కాంట్రాక్టుల అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి ఆరోపించారు. శేఖర్ రెడ్డి, రంగారెడ్డి, దామోదర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, తదితరులు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్టర్లు ధర్నా చేయడం పై తప్పు పట్టారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడే కాంట్రాక్టర్లు అంత అధికారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విజయ్ కుమార్, పట్నం శ్రీశైలం, శ్రీనివాస్ తదితరులు ఆరోపిస్తున్నారు. దీంతో కాంట్రాక్టర్ల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మున్సిపల్ ఆఫీసులో అయోమయం నెలకొన్నది కొంతమంది కాంట్రాక్టర్లు టెండర్ల విషయంలో వివరణ ఇవ్వాలని కమిషనర్ సరస్వతి, డీఈ వెంకన్నతో మాట్లాడారు. ఇరువు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. కమిషర్ మాట్లాడుతూ టెండర్ ప్రక్రియ పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చాలామంది కాంట్రాక్టర్లు టెండర్ వచ్చిన తర్వాత సక్రమంగా పనులు చేయడం లేదన్నారు. ఆన్లైన్ల టెండర్లో ఎవరికి వస్తే వారికే ఇస్తామన్నారు.