మురుగు ముంపునకు పరిష్కారంగా ప్రతిపాదించిన వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదల జీహెచ్ఎంసీకి సవాల్‌గా మారింది. నాలా అభివృద్ధి పనులంటేనే కాంట్రాక్టర్లు జడిసిపోతున్నారు. దీనికి కారణం బల్దియాలో పనులు చేస్తే సకాలంలో బిల్లులు రావడం లేదన్న అపవాదు బలంగా ఉండటమే. గడిచిన కొన్ని నెలలుగా రూ. 1400 కోట్ల బకాయిలపై కాంట్రాక్టర్లు జీహెచ్ఎంసీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ.. తమ నిరసన గళాన్ని వినిపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ నాలా అభివృద్ధి పనుల టెండర్లకు కాంట్రాక్టర్ల నుంచి స్పందన రావడం లేదు.
ఒక్కొక్క పనికి రెండు, మూడు సార్లు టెండర్లు పిలుస్తున్న పరిస్థితి. సుమారు 542 కోట్లతో 43 ప్రాంతాల్లో 58 కిలోమీటర్ల మేర నాలా అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించిన బల్దియా ఈ మేరకు టెండర్లు పిలిచింది. ఇందులో ఇప్పటివరకు తొమ్మిది చోట్ల మాత్రమే పనులు ప్రారంభమవ్వగా, విడతల వారీగా టెండర్లు పిలుస్తూ వస్తున్నారు. తాజాగా, కూకట్పల్లి, పటాన్చెరు, చందానగర్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో నాలా అభివృద్ధి టెండర్లు పిలిచారు. ఎక్కువ శాతం ఈ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో అధికారులు సందిగ్ధంలో పడ్డారు. సకాలంలో పనులు ప్రారంభించి, వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అధికారులు.. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పరిస్థితులతో ఏం చేయాలో పాలుపోవడం లేదంటూ కొందరు ఇంజినీర్లు చెబుతున్నారు.
ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, సీఆర్ఎంపీ పథకాల స్థానంలో కాంగ్రెస్ సర్కారు ‘హెచ్ సిటీ’(హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్, ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)కి రూపకల్పన చేసింది. ఇందులో కేవలం తొమ్మిది ప్రాంతాల్లో పనులు మొదలు కావడం, ఇందులో అత్యధికంగా రూ. 30 కోట్ల లోపు మాత్రమే ఉండటం గమనార్హం. పనులు ప్రారంభమైన వాటిని పరిశీలిస్తే చార్మినార్ జోన్‌లోని మౌలా కా చిల్ల నుంచి హైదరాబాద్ ఇస్లామిక్ పాఠశాల వరకు రూ.6.5 కోట్లతో బాక్స్ డ్రైన్, బండ్లగూడ జేఎన్ఎన్యూఆర్ఎం హౌసింగ్ నుంచి ఎర్రకుంట వరకు రూ. 33 కోట్లు బాక్స్ డ్రైన్, సన్నీ గార్డెన్ నుంచి శివాజీనగర్ వరకు ముర్కీ నాలాకు ఇరు వైపులా రిటైనింగ్ వాల్ రూ. 27.5 కోట్లు, నూరమ్మ చెరువు నుంచి మీరాలం ట్యాంక్ వరకు రూ. 53.35కోట్లు, అరుంధతినగర్ నుంచి అక్బర్‌నగర్ ఎగువకు రిటైనింగ్ వాల్ రూ.9.9 కోట్లు, కిషన్‌బాగ్ రోడ్డులో మాజీద్ కిరాణా స్టోర్ నుంచి మూసీ వరకు వాల్ రూ.7.7 కోట్లతో పనులు జరుగుతున్నాయి. టెండర్ దశలో కేకే గార్డెన్ నందనపురి కాలనీ వరకు రూ. 7.49కోట్లతో డ్రైన్, శేరిలింగంపల్లి జోన్లో గపూర్‌నగర్ జంక్షన్ నుంచి దుర్గం చెరువు ఎంట్రీ ప్లాజా వరకు ఆర్సీసీ బాక్స్ డ్రైన్ రూ.11.55 కోట్లు, అంబేద్కర్ కాలనీ నుంచి శిశుమందిర్ ఏరియా రూ.6 కోట్లు, జనార్దన్ హిల్స్ నుంచి ఖాజాగూడ పెద్ద చెరువు యురో కిడ్స్ వరకు డ్రైన్ పనులకు రూ.14 కోట్లతో టెండర్ పిలిచారు. తాజాగా, మరిన్ని చోట్ల పనులకు టెండర్లు పిలిచారు. ఇదిలా ఉంటే ఈ వర్షాకాలంలో కొత్తగా ఏ ఒక్క ప్రాంతంలో వరద ముంపు సమస్యను తప్పించలేకపోయారంటూ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం వాయువేగంతో ఎస్ఎన్డీపీ పథకాన్ని తీసుకొచ్చి.. రూ.985.45కోట్లతో మొదటి విడత పనులు చేపట్టింది. రూ.592.68 కోట్లు ఖర్చు పెట్టి 39 చోట్ల పనులను పూర్తి చేసి ముంపు సమస్యలు తొలగించిందని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.