bagh amberpet | అంబర్‌పేట, మే 16 : అధికారుల అలసత్వం.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వెరిసి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్లోని బతుకమ్మ కుంట, బృందావన్ కాలనీల్లో నాణ్యత లేకుండా పనులు చేయడంతో.. కొన్ని నెలలకే బస్తీవాసులు ఇక్కట్ల పాలవుతున్నారు.
బాగ్‌అంబర్‌పేట డివిజన్ బతుకమ్మకుంట, బృందావన్‌కాలనీలో ఆరు నెలల క్రితం రూ.14 లక్షల వ్యయంతో కొత్త డ్రైనేజీ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. కొత్త పైప్‌లైన్ ఏర్పాటుతో పాత పైప్ లైన్‌ను డమ్మీ చేశారు. అయితే పాత డ్రైనేజీ పైప్‌లైన్ నాలుగు ఫీట్ల లోతులో ఉండగా, కొత్త పైప్‌లైన్‌ను కేవలం రెండు ఫీట్ల లోతులో మాత్రమే ఏర్పాటు చేశారు. ఆ సమయంలో బస్తీవాసులు అభ్యంతరం తెలిపారు. పాత లైన్ నాలుగు ఫీట్ల లోతులో ఉండగా, కొత్త లైన్‌ను రెండు ఫీట్ల లోతులో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు. కానీ సదరు పనులు చేసే కాంట్రాక్టర్ బస్తీవాసుల మాటలు ఖాతరు చేయకుండా నిర్లక్ష్యంగా రెండు ఫీట్లలోనే పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. పైపైన మన్ను పోసి వదిలేశాడు.
రోడ్డు పనుల కోసం తవ్వుతుండగా..
వారం రోజుల క్రితం ఇదే బస్తీలో అధ్వాన్నంగా మారిన రోడ్డు స్థానంలో కొత్త రోడ్డును నిర్మించేందుకు ఎమ్మెల్యే, కార్పొరేటర్ పనులను ప్రారంభించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ జేసీబీని తీసుకువచ్చి పాత రోడ్డును తవ్వడం మొదలుపెట్టాడు. కేవలం రెండు ఫీట్ల లోతులో ఏర్పాటు చేసిన డ్రైనేజీ పైప్‌లైన్ జేసీబీ దెబ్బకు పైకి లేచింది. పైపులు పగిలిపోయాయి. డ్రైనేజీ మురుగు బయటకు రావడం మొదలైంది. మ్యాన్‌హోళ్లు మూసుకుపోయి మట్టి మొత్తం చేరింది. డ్రైనేజీ జామ్ అయింది. పైప్‌లైన్ నుంచి మురుగు బయటకు వెళ్లడం లేదు. దీంతో బస్తీవాసులకు కష్టాలు మొదలయ్యాయి. తాము చెప్పినా వినకుండా వాటర్‌వర్క్స్ అధికారులు, కాంట్రాక్టర్ ఆరు నెలల క్రితం డ్రైనేజీ పైప్‌లైన్‌ను కేవలం రెండు ఫీట్ల లోతులో ఏర్పాటు చేశారని, దాని కారణంగానే ఇప్పుడు ఈ దుస్థితి తలెత్తిందని వాపోయారు. మొత్తం డ్రైనేజీ సిస్టం మార్చిన తర్వాతనే కొత్త రోడ్డును వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు రోడ్డు పనులు ఆపేయాలని చెప్పారు. పక్కనే ఉన్న సాయిమధురానగర్లో రోడ్డు పనులు ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డిని తీసుకెళ్లి పరిస్థితిని స్వయంగా చూపించారు. తమ బాధను వారికి చెప్పారు. వాటర్‌వర్క్స్ కాంట్రాక్టర్ కు చెప్పినా కావాలనే రెండు ఫీట్ల లోతులో పైప్‌లైన్ ఏర్పాటు చేశారని ఫిర్యాదు చేశారు. బస్తీవాసుల ఫిర్యాదుకు స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత వాటర్‌వర్క్స్ అధికారులకు విషయాన్ని చెప్పారు. మొదట పైప్‌లైన్ సంగతి చూడాలని, తర్వాతనే రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. బస్తీవాసులను ఇబ్బందులకు గురి చేయవద్దని పేర్కొన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు.