Tourism Department | హిమాయత్ నగర్, జూన్ 13 : రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం సంస్థలో గత 24 ఏండ్లుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే 166 మంది కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి శుక్రవారం హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. కొంతమంది పర్మినెంట్ ఉద్యోగులు పదవీ విరమణ పొందడంతో ఉన్న కార్మికులపై పని భారం పెరుగుతుందని తెలిపారు. ఏండ్ల తరబడి సంస్థను నమ్ముకుని చాలీచాలని వేతనాలు పొందుతూ కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారని, వీరికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. మహేష్ కుమార్ గౌడ్ సానుకూలంగా స్పందించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పర్మినెంట్ చేసేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారని రాజమౌళి తెలిపారు.