సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): బల్దియాలో పాలన గాడి తప్పుతోంది. ఇప్పటికే ఎలక్ట్రికల్ విభాగం నిర్లక్ష్యంతో వీధి లైట్ల నిర్వహణ సక్రమంగా జరగక రాత్రివేళల్లో చాలా ప్రాంతాల్లో చీకటి అలుముకుంటోంది. ఇదిలా ఉంటే గత కొన్నేళ్లుగా మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా ప్రధాన రోడ్లు, సీఆర్ఎంపీ రోడ్లపై స్వీపింగ్ మెషీన్ వాహనాలతో దుమ్ము, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి పరిశుభ్రంగా ఉంచుతున్నారు. కాగా అద్దె ప్రాతిపదికన కొనసాగుతున్న స్వీపింగ్ మెషీన్ వాహనాల నిర్వహణ గడువు అద్దె గడువు జూన్ చివరి వారంలో ముగిసింది.
దీనికి తోడు స్వీపింగ్ మెషీన్ వాహనాల సేవలను బల్దియా అధికారులు రెన్యూవల్ చేయకపోవడంతో.. సంబంధిత యాజమానులు వాటిని నిలిపివేశారు. వాస్తవానికి ముందే టెండర్లు పిలిచి కొత్తవారికి పనులు అప్పగించాల్సిన చోట సంబంధిత జోనల్ అధికారులు అలసత్వం ప్రదర్శించారనే విమర్శలున్నాయి. ఫలితంగా గడిచిన కొన్ని రోజులుగా రహదారులపై దుమ్మును క్లీన్ చేసే స్వీపింగ్ మెషీన్లు చాలాచోట్ల నిలిచిపోయి డివైడర్లు, రోడ్ల వద్ద మట్టి పేరుకు పోయి ప్రమాదకరంగా మారడంతో పాటు అపరిశుభ్రత దర్శనమిస్తోంది.
జీహెచ్ఎంసీ పరిధిలో 1,161 కిలోమీటర్ల మేర కమర్షియల్ రోడ్లు ఉన్నాయి. ఇందులో సీఆర్ఎంపీ 698 కిలోమీటర్లకు సంబంధించి 20 స్వీపింగ్ మెషీన్లు, నాన్ సీఆర్ఎంపీ రోడ్లు 463 కిలోమీటర్లకు సంబంధించి 19 మెషీన్లు పనిచేస్తున్నాయి. సీఆర్ఎంపీ రోడ్ల నిర్వహణ టెండర్ ప్రక్రియ ప్రభుత్వ స్థాయిలో ఉండటంతో సీఆర్ఎంపీ రోడ్లను జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్నది. దీనికి తోడు నాన్ సీఆర్ఎంపీ రోడ్లలోనూ స్వీపింగ్ మెషీన్లు అద్దె ప్రాతిపదికన సేవలు అందిస్తున్నాయి.
వాస్తవంగా జీహెచ్ఎంసీకి సంబంధించి దాదాపు 38 స్వీపింగ్ మెషీన్లు ఉండగా.. వీటిలో 17 వాహనాల కాలపరిమితి ముగియడంతో పక్కన పడేశారు. సర్కిల్‌కు ఒకటి చొప్పున అద్దె ప్రాతిపదికన ఎజెన్సీలకు ఒక్కో వాహనానికి ఏడాదికి రూ.కోటి 13 లక్షలకు పైగా చెల్లిస్తున్నారు. ప్రతి ఏటా వీటి కోసం రూ.20కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఒక్కో స్వీపింగ్ మెషీన్ వాహనం 40 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వరకు రోడ్లను క్లీన్ చేయాలి. కానీ కొన్ని ఎజెన్సీలు సగం దూరం కూడా చేయకుండా బిల్లులు క్లెయిమ్ చేయించుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో అధికారుల హస్తం కూడా ఉందనే ఆరోపణలు లేకపోలేదు.
వీటితో పాటు నగరంలోని వీఐపీలు ఉండే ప్రాంతాల్లోనే తప్ప కమర్షియల్ కారిడార్లు, ప్రధాన రహదారులపై స్వీపింగ్ మెషీన్లు కనిపించడం లేదని కార్మిక సంఘాల నేతల ఆరోపణ. వాస్తవంగా అద్దె ప్రాతిపదికన కొనసాగుతున్న వాహనాలకు స్వస్తి పలికి ఏడాదికి వీటికి చెల్లించే అద్దెతోనే కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉందని.. ప్రజాధనం వృథా కాకుండా ఆదిశగా బల్దియా అధికారులు చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.