సుల్తాన్‌బజార్, డిసెంబర్ 13: మూడు నెలలుగా ఉస్మానియా దవాఖానలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల్లేక పోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. సకాలంలో జీతాలు లేకపోయినా పస్తులుంటూ మరీ విధులు నిర్వరిస్తున్నామంటూ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ సకాలంలో జీతాలు అందడం లేదని వాపోతున్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో జీతాలు లేకపోయినా నెలలో ఎప్పుడైనా వస్తాయనే ఆశతో విధులు నిర్వర్తిస్తున్నామని పలువురు మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్లు,ల్యాబ్ ఈసీజీ, ఎమ్మారై, సీటిస్కాన్, ఈఈజీ, రోగ నిర్ధారణ కేంద్రాలు, స్టాఫ్ నర్సులు ఇలా వివిధ విభాగాల్లో మొత్తంగా 3 ఏజెన్సీలకు చెందిన సుమారు 217 మంది కాంట్రాక్టు ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. మూడు ఏజెన్సీలకు ఒక్కొక్కరికీ 50 చొప్పున కాంట్రాక్టు ఉద్యోగులు గతంలో టెండర్లు దక్కించుకున్నారు. ఆయా ఏజెన్సీల స్వీయ పర్యవేక్షణలో కాంట్రాక్టు ఉద్యోగులు గత కొన్నేండ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మూడు నెలలుగా ఉద్యోగులకు జీతాలు మంజూరు కాలేదు. గతంలో అనేకసార్లు ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు,వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని కాంట్రాక్టు ఉద్యోగులు చెబుతున్నారు. 3 నెలల జీతాలు చెల్లించి తమ కుటుంబాల్ని ఆదుకోవాలని కోరుతున్నారు.