అంబర్‌పేట: బాగ్‌అంబర్‌పేట డివిజన్ ఇందిరానగర్‌లో నల్లాల్లో కలుషిత నీటి సరఫరాపై ‘నమస్తే’లో 4న ‘పది రోజులుగా..కలుషిత నీరు’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి వాటర్‌వర్క్స్ అధికారులు స్పందించారు. సీజీఎం ప్రభు, నారాయణగూడ డివిజన్ జీఎం శ్రీధర్‌రెడ్డి, అడిక్‌మెట్ సెక్షన్ మేనేజర్ తదితరులు కలుషిత మంచినీరు సరఫరా అవుతున్న ఇంటికి వెళ్లారు.
ఎన్ని రోజులుగా నీరు కలుషితమై వస్తున్నదని యజమానిని అడిగి తెలుసుకున్నారు. ఏ ఇంటిలోనైతే మురుగునీరు వస్తుందో.. ఆ ఇంటికి చెందిన డ్రైనేజీ పైప్‌లైన్ పూర్తగా పాడైపోయిందని గుర్తించారు. ఆ పైప్‌లైన్‌తోనే నీరు కలుషితమై వస్తున్నదని, వెంటనే పైప్‌లైన్ మార్చాలని సీజీఎం సంబంధిత సెక్షన్ మేనేజర్‌ను ఆదేశించారు. కలుషిత మంచినీటి సమస్య లేకుండా చూడాలన్నారు.